1 August, 2026 | 3:48 PM

స్వర్ణాంధ్ర విజన్‌కు శుభదినం

01-08-2026 03:06 PM

డబుల్ స్పీడ్ తో ఏపీ అభివృద్ధి

వికసిత్ భారత్ కు గ్రోత్ ఇంజిగ్ గా ఆంధ్రప్రదేశ్

దేశంలో బ్లూ ఎకానమీని అభివృద్ధి చేస్తున్నాం

విజయనగరం: స్వర్ణాంధ్రప్రదేశ్(Swarnandhra)కు ఇదొక శుభదినమని ప్రధాని మోదీ(Narendra Modiఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం(Alluri Sitarama Raju International Airport) ప్రారంభోత్సవంలో అన్నారు. అందరికీ నమస్కారం అంటూ ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఇవాళ ఏపీ అభివృద్ధిలో కీలకమైన రోజు అన్నారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం తనకు దక్కిందని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్నకు, పైడతల్లి అమ్మవారికి మోదీ ప్రణామాలు చేశారు. రూ. 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని శరవేగంగా, అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని సూచించారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసాను చూసి మధురానుభూతికి లోనయ్యా అన్నారు. గిరిజన మహిళల థింసా నృత్యం ప్రంపచ రికార్డు సాధించిందని పేర్కొన్నారు. ఒకేసారి 13 వేల మంది గిరిజన మహిళల నృత్యం నిజంగా అద్భుతమని కొనియాడారు.

థింసా నృత్యంలో(Dhimsa Dance) మన తరతరాల వారసత్వం కనిపించిందని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం అల్లూరి సీతారామారాజు పోరాటం చేశారని గుర్తుచేశారు. ఈ ఎయిర్ పోర్టుకు గిరిజనునల కోసం పోరాడిన అల్లూరి పేరు పెట్టుకున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్ వేగా, లాంచ్ ప్యాడ్ గా ఇది పనిచేస్తోందన్నారు. గతంలో ఎక్కడ ఎయిర్ పోర్టు కట్టినా ఒక కుటుంబం పేర్లే ఉండేవని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక విమానాశ్రయాలకు మహనీయుల పేర్లు పెడుతున్నామని సూచించారు. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేశామని వ్యాఖ్యానించారు. ఉడాన్ ద్వారా దేశ విమానయానరంగంలో పెను మార్పులు వచ్చాయన్న ప్రధాని మోదీ విమానం ఎక్కాలన్న పేద, మధ్యతరగతి వర్గాల కలలు సాకారం చేశామని వెల్లడించారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల  డబుల్ స్పీడ్ తో ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు. వికసిత్ భారత్(Viksit Bharat)కు గ్రోత్ ఇంజిన్ గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని తెలిపారు. దేశంలో బ్లూ ఎకానమీని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. ఏపీలో రూ. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు(Railway Projects) కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాలతో విశాఖ అనుసంధానం చేస్తామన్నారు.

తెలుగువాళ్లు  సత్తా చాటుతున్నారు

సాఫ్ట్ వేర్, ఐటీ, టెక్ సెక్టార్ లో తెలుగువాళ్లకు(Telugu people) మంచి పేరు ఉందని ప్రధాని కొనియాడారు. దేశ, విదేశాల్లో తెలుగువాళ్లు తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడుతోందని సూచించారు. చంద్రబాబు సారథ్యంతో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీ మారుతోందన్నారు. అనేక దేశాల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని పీఎం మోదీ తెలిపారు. ఈ రాష్ట్రంలో గ్రోత్ ఈకో సిస్టం(Growth Ecosystem) నిర్మిస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. సెమీ కండక్టర్, డేటా సెంటర్ రంగాల్లో వేగంగా పనులు జరుగుతున్నాయని నరేంద్ర మోదీ వెల్లడించారు.

కేంద్రం..నక్కపల్లిలో భారీ ఫార్మా కంపెనీ నిర్మిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో(Green energy sector) రాయలసీమకు రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని లెక్క చెప్పారు. రూ .2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీలోనే ప్రారంభించినట్లు సూచించారు. రాష్ట్రంలో ప్రతిరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అనేక పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఉత్పత్తి, ఎగుమతులు పెరుగుతున్నాయని తెలిపారు. పెట్టుబడులు పెరిగితేనే తయారీ రంగం పెరుగుతోందని వివరించారు. క్రమంగా ప్రజల ఆదాయం పెరుగుతుంది.. జీవనశైలి మారుతోందన్నారు. మనమంతా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సంకల్పం తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.