21 April, 2026 | 1:48 PM

ఎన్డీయే పాలనలో రైతులకు రెట్టింపు ఆదాయం.. ఇదీ మోదీ గ్యారంటీ

19-04-2026 01:50 PM

పురూలియా: పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. పురూలియాలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్ జంగిల్ రాజ్ పాలనలో ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారని, ఆదివాసీల భూములపై టీఎంసీల సిండికేట్ రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. టీఎంసీ పాలనలో రోడ్డు, పాఠశాలలు, నీళ్ల వంటి కనీస సౌకర్యాలు సరిగా లేవని,  రైతుల పొలాలకు నీళ్లు అందట్లేదని, రైతులను అడుగడుగునా మోసం చేశారు.

కర్షకులకు కన్నీళ్లే మిగిలాయని, బంగాల్ అధికార పార్టీ నేతలు లూటీ చేయడంలో మునిగిపోయారని విమర్శించారు. లూటీదారులను కాపాడడంలో టీఎంసీ నేతలు శ్రమిస్తున్నారని, ఎన్డీయే పాలనలో రైతులకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది.. ఇదీ మోదీ గ్యారంటీ అన్నారు. రైతుల పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. టీఎంసీ మంత్రులు వేలాది మంది యువతను మోసం చేస్తూ, ఉపాధ్యాయ నియామక ప్రక్రియను దోచుకున్నారు. టీఎంసీ అటవిక పాలనలో, కట్ (కమిషన్) లేకుండా ఏ పని జరగదని అన్నారు. 

మరి కోత అనివార్యమైనప్పుడు, పరిశ్రమలు ఎక్కడి నుండి వస్తాయి? అందుకే, ఇక్కడ పరిశ్రమలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పారు. భయం వల్ల పరిశ్రమలు రావు, నమ్మకం ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, నమ్మకం మీదే పరిశ్రమలు నడుస్తాయి, పెట్టుబడులు కూడా నమ్మకం ఉంటేనే వస్తాయి, నా రాజకీయ అనుభవం ఆధారంగా, మే 4వ తేదీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని తను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరూ బీజేపీకి చెందినవారే కాబట్టి, పురూలియా అభివృద్ధి ప్రస్తుత వేగం కంటే రెట్టింపు వేగంతో ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.