ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృతి
మరొకరికి గాయాలు
రోమ్, ఏప్రిల్ 19: ఇటలీలో ఇద్దరు భారతీయులపై సాయుధ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో భారత్‌కు చెందిన రాజిందర్ సింగ్ (48), గుర్మిత్ సింగ్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. పక్కా పథకం ప్రకారమే దాడి జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి పది తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైశాఖి పండగ సందర్భంగా బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో ఉన్న ఓ గురుద్వారా నుంచి బయటకు వస్తున్న సమయంలో వీరిద్దరిపై కాల్పులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది.
అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి కారులో పారిపోయాడు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కా ల్పులకు దారితీసిందనే వాదనలు వినిపించినప్పటికీ అధికారులు తమ ప్రాథ మిక నివేదికలో దీన్ని కొట్టిపారేశారు. పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా గురుద్వారాకు తరచుగా వచ్చే ఓ భారతీయుడేనని ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాకు తెలిపాడు. కాల్పుల ఘటనలో మూడో వ్యక్తికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయన్నారు.






