వన్యప్రాణికి కరెంటు ఉచ్చు?
అటవీ ప్రాంతాల్లో రెచ్చిపోతున్న వేటగాళ్లు
బలైపోతున్న అరుదైన జంతు జాలం
మహబూబాబాద్, మే 29 (విజయక్రాంతి): అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం ఓవైపు కృషి చేస్తుండగా, మరోవైపు కొందరు వేటగాళ్లు మాత్రం విద్యుత్ తీగలను ఉచ్చులుగా మార్చి అమాయక జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ తో పాటు జనగామ అటవీ ప్రాంతాల్లో విద్యుత్ షాక్తో వన్యప్రాణుల వేట సంఘటనలు రోజురోజుకు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.
అడవి పందులు, జింకలు, కుందేళ్లు, నెమళ్లు మాత్రమే కాకుండా అరుదైన జాతుల జంతువులు కూడా ఈ విద్యుత్ ఉచ్చులకు బలవుతున్నాయి. గ్రామాల సమీపంలోని అడవి ప్రాంతాలు, వ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు వేయడం ద్వారా జంతువులను చంపే ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాల చుట్టూ విద్యుత్ వైర్లు అమర్చి వేట సాగిస్తున్నారు. ఆహారం కోసం అడవుల నుంచి బయటకు వచ్చే జంతువులు ఈ ఉచ్చుల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి.
కరెంటు ఉచ్చు ఎలా పనిచేస్తుంది?
వేటగాళ్లు వ్యవసాయ మోటార్ల నుంచి లేదా నేరుగా విద్యుత్ లైన్ల నుంచి తీగలను పొలాల చుట్టూ లేదా జంతువులు తిరిగే మార్గాల్లో అమర్చుతారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా కొనసాగుతున్న సమయంలో జంతువు తీగను తాకగానే తీవ్ర షాక్కు గురై ప్రాణాలు కోల్పోతుంది. అనంతరం మృతదేహాన్ని మాంసం కోసం లేదా అక్రమ విక్రయాల కోసం తరలిస్తారు.
ప్రమాదంలో వన్యప్రాణులు విద్యుత్ ఉచ్చుల కారణంగా అడవి పందులు, జింకలు, దుప్పులు, కుందేళ్లు, నెమళ్లు వంటి జీవులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కొన్నిసార్లు చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు కూడా ఈ ఉచ్చులకు బలవుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇలాంటి వేట వల్ల వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోవడంతో అడవి జీవవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు
ఈ అక్రమ విద్యుత్ తీగలు వన్యప్రాణులకు మాత్రమే కాదు.. సమీప గ్రామస్తులు, కాపరులు, రైతులు కూడా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంది. తెలియక తీగలను తాకిన పలువురు వ్యక్తులు గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల ప్రాణనష్టాలు కూడా సంభవించాయి. విద్యుత్ ఉచ్చుల వేటను అరికట్టేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలతో గస్తీ నిర్వహిస్తోంది.
అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు పెంచడంతో పాటు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అక్రమ వేటకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలకు వెలుగు చూస్తున్న విద్యుత్తు షాక్ తో మృతి చెందిన వన్యప్రాణుల ఉదంతాలు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
ప్రజల్లో అవగాహన అవసరం
అడవులు, వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతకు కీలకం. తాత్కాలిక లాభాల కోసం జంతువుల ప్రాణాలు తీయడం పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. విద్యుత్ ఉచ్చులు కనిపించిన వెంటనే అటవీ శాఖ లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రకృతిని కాపాడాల్సిన మనిషే వన్యప్రాణులకు శత్రువుగా మారడం బాధాకరం. విద్యుత్ షాక్తో వేటను పూర్తిగా అరికట్టాలంటే కఠిన చట్టాలతో పాటు ప్రజల్లో బాధ్యతా భావం పెరగాలి.
పంటలు కోల్పోయే రైతులకు తక్షణం నష్టపరిహారం అందించడం, సౌర శక్తితో తక్కువ విద్యుత్తు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, పంట పొలాల వెంట కందకాలు తీయడం, వన్యప్రాణులకు ప్రాణాన్ని లేకుండా పంటలను కాపాడుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అడవులు జీవంతో కళకళలాడాలంటే& వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాలి.






