నత్త నడకన సాగుతున్న రోడ్డు పనులు
తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు
జవహర్ నగర్, మే 29(విజయక్రాంతి): జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం నుండి చెన్నాపురం చౌరస్తా వరకు రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయి. ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. కొంపల్లి, అల్వాల్ బొల్లారం పరిసర ప్రాంతాల నుండి చర్లపల్లి కి వెళ్లడానికి అనువైన దారి కావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఈ దారి గుండా ప్రయాణిస్తున్నప్పటికీ ప్రజలు రాకపోకలకు అనేక అవస్థలు పడుతున్నారు.
జవహర్నగర్లో నాలుగు రోడ్లను హెచ్‌ఆర్డీసీఎల్ అభివృద్ధి చేస్తోంది. ఫైరింగ్ కట్ట నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి దమ్మాయిగూడకు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డుకు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి వంపుగూడ రోడ్డు వైపు. ఈ రోడ్లన్నీ 100 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు. రాంపల్లి క్రాస్ రోడ్డు నుంచి సర్వే నెం.421 వరకు, ఎమ్నంపేట్ నుంచి నాగారం హద్దు వరకు పూర్తికాగా, చర్లపల్లి నుంచి ఓఆర్‌ఆర్కు, దమ్మాయిగూడ చీర్యాల, అహ్మద్గూడ ప్రాంతాల్లో కూడా పనులు జరుగుతున్నాయి.
దమ్మాయిగూడ ఎక్స్ రోడ్ నుండి నాగారం వెళ్లే దారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాన దారులు ప్రమాదానికి గురవుతున్నారు. అదేవిధంగా దమ్మాయిగూడ ఎక్స్ రోడ్ నుండి చిన్నపురం చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా తవ్వారు& వదిలేశారు.. తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు అధికారుల మధ్య సమన్వయ లోపం స్థానికుల పాలిట శాపంగా మారింది.
తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు రాకపోకలకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. జరుగుతున్న పనులు కూడా నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాకపోకలకు అనేక అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు తవ్వి వదిలిన రోడ్డుపై ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడి గాయాల పాలవుతున్నారు. ఇలా ఎంతకాలమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
త్వరితగతిన రోడ్డు వేస్తే రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా చేసేందుకు వీలుంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. లేకుంటే నిత్యం ప్రమాదాల బారిన పడి గాయాల పాలవడం తప్పదని తెలుపుతున్నారు. పనులు ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు నత్త నడకన సాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన రోడ్డు పనులు చేపట్టి ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఫైరింగ్ కట్ట రోడ్ నుండి యాప్రాల్ వైపు వెళ్లే హనుమాన్ టెంపుల్ రోడ్డు వరకు ఇరువైపుల కంకర పోసి వదిలేశారు. ఈ కంకర పోయడం వల్ల వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.






