24 July, 2026 | 10:46 AM

ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు

24-07-2026 09:42 AM

బాన్సువాడలో భారీ ర్యాలీ, కేక్ కటింగ్, అన్నదానాలు...  

ఆలయాల్లో ప్రత్యేక పూజలు...

బాన్సువాడ, జూలై 23 (విజయ క్రాంతి): మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం భాస్కర్ రెడ్డి తన తండ్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదం తీసుకుని బాన్సువాడకు చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడ్మి చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి డిజే పాటలు, పూల వర్షం, కేకులతో భారీ ర్యాలీగా పట్టణంలోకి ప్రవేశించారు.అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఏర్పాటు చేసిన రెండు భారీ కేకులను కట్ చేశారు.

బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్ని, పాత మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. పైన్ ఆపిల్‌తో తయారు చేసిన గజమాలను పోచారం భాస్కర్ రెడ్డి దంపతులకు సమర్పించారు. హైదరాబాద్ నుంచి చేరుకున్న ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడిని ఆశీర్వదించారు. పార్టీ నాయకులు, అభిమానులు భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనపై అభిమానంతో విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని, ప్రజలు నేరుగా తన వద్ద రావచ్చని పేర్కొన్నారు.

భాస్కర్ రెడ్డి 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ రుద్రూర్, వర్ని, కోటగిరి, పోతంగల్, బాన్సువాడ, చందూర్, మోస్రా, బీర్కూర్ మండలాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాంగ్రెస్ యువజన నాయకుడు శశికాంత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్ని మండలాల్లో అన్నదానాలు నిర్వహించారు.దేశాయిపేట్ గ్రామ ప్రాథమిక పాఠశాల ఎస్‌సి కాలనీలో విద్యార్థులకు యువ నాయకులు ప్రశాంత్ నోట్ బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు.