24 July, 2026 | 11:18 AM

కళ్యాణలక్ష్మి దరఖాస్తుల్లో నకిలీ ధ్రువపత్రాల కలకలం

24-07-2026 10:41 AM

భిక్కనూరులో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అదుపులో

భిక్కనూర్, జూలై 23(విజయక్రాంతి): పేద బాలికల వివాహాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం పేరుతో భిక్కనూర్ మండలంలో నకిలీ వయస్సు ధ్రువపత్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి అవసరమైన కనీస వయస్సు లేకపోయినా పథకం ప్రయోజనం పొందేందుకు రీజినల్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంవో) సంతకం, అధికారిక ముద్రను నకిలీగా తయారు చేసి వయస్సు ధ్రువపత్రాలు రూపొందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు నకిలీ ధ్రువపత్రాలను సిద్ధం చేసి కళ్యాణలక్ష్మి దరఖాస్తులకు జత చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న కామారెడ్డి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా భిక్కనూర్‌కు చెందిన ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? నకిలీ ధ్రువపత్రాలతో ఎన్ని దరఖాస్తులు సమర్పించారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పథకం పేరుతో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.