24 July, 2026 | 10:49 AM

కాళేశ్వరం జలాలను SRSP కాలువల ద్వారా విడుదల చేయాలి

24-07-2026 09:40 AM

జిల్లా కలెక్టర్‌కు గ్రామీణ పేదల సంఘం వినతి

సూర్యాపేట, జూలై 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో నెలకొన్న సాగు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి ఎస్‌ఆర్‌ఎస్‌పీ (SRSP) కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని సరఫరా చేయాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్‌కు సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు నెలకొన్న నేపథ్యంలో, రిటైర్డ్ ఇంజినీర్లు సూచించిన విధంగా కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువల్లోకి విడుదల చేస్తే సాగు, తాగునీటి సమస్యలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు బోర్లపై ఆధారపడుతున్నారని, కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసి లో-వోల్టేజ్, మోటార్లు కాలిపోయే సమస్యలను నివారించాలని కోరారు. పెరిగిన ఎరువుల ధరలను తగ్గించి, యూరియా బస్తాలను రైతులకు సరిపడా అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ స్వప్రయోజనాలను పక్కనబెట్టి రైతాంగం, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కోడి బండ్లయ్య, అనంతుల ఎల్లయ్య, పాలకూరి ఎల్లయ్య, వెంకన్న, నల్లగొండ ఎంకన్న, ఎడ్ల వెంకన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.