13 April, 2026 | 10:17 PM

సీఎం, మంత్రులపై పోచారం అసహనం...

13-04-2026 09:08 PM

నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు బిల్లులు రాక పనులు నిలిచిపోయాయి...

సీఎంకు 20 సార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు...

నిధుల విడుదలకు మంత్రుల కాళ్లు మొక్కాలా...?

అభివృద్ధి,ప్రజల కోసమే పని చేస్తున్నా... అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను

ఇరిగేషన్ సిఈతో ఫోన్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్లగక్కిన ఆవేదన

బాన్సువాడ,(విజయక్రాంతి): అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లో వందల కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగకూడదనే, తాను నిర్ణయం మార్చుకొని ప్రభుత్వం లో చేరినా ఫలితం కనిపించడం లేదని ఆవేదన చెందారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద అయన ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు బైఠాయించారు. మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ తో బిల్లుల మంజూరు విషయమై ఫోన్లో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తపర్చారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, సీఎంకు 20 సార్లు ఫోన్ చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను మంత్రుల కాళ్లు మొక్కాలా?’అని ప్రశ్నించారు. బిల్లులు రాక అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని, కాంట్రాక్టర్లు పనులు వదిలి వెళ్లిపోతున్నారని తెలిపారు. బ్రతిమిలాడి పనులు ముందుకు నడిపిస్తున్నానన్నారు. 20 ఏళ్లు మంత్రిగా పనిచేశా... ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రైనా లిఫ్ట్ చేసేవాడిని. ఇప్పుడున్న మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు  అని గుర్తు చేశారు.

ప్రజల కోసమే ఫోన్ చేస్తాం. నాలాంటి వాళ్లకే స్పందించకపోతే ఈ రాజకీయం ఎందుకు? ఈ వయసులో కాళ్లు మొక్కే పనులు చేసుకోవాలా? అని వాపోయారు. బిల్లులు రాక చేపట్టిన పనులు ఆగిపోతే తుమ్మ చెట్లు మొలుస్తాయని, ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రావడం లేదని అన్నారు. 32 కోట్లు మంజూరైతే ఇంకా 4కోట్లు కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సి ఉందని, నర్సింగ్ కాలేజీ పనులు నిల్చిపోతే, కాంట్రాక్టర్ను బతిమా లి పనులు ప్రారంభించా... అతనికి 15 కోట్లు రావాలి... అని ఆవేదన చెందారు. ఈ జంగల్ లోనే కూర్చుంటా... ఏమైతది... చచ్చిపోతాం కదా... ఎప్పుడైనా పోయేది కదా అంటూ ఇరిగేషన్ సి ఈ తో ఆవేదనతో పేర్కొన్నారు.

బిల్లులు ప్రభుత్వం నుండి రూపాయి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బిల్లులు రాక వెళ్లిపోతున్నా కాంట్రాక్టర్లను బ్రతిమిలాడి పనులను ముందుకు సాగిస్తున్న అన్నారు.బిల్లులు రావడంలేదని ఎలా పని చేయాలని  కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పోచారం.పై స్థాయి అధికారులు  రిక్వెస్ట్ చెయ్యడంతో 2 రోజులు చూద్దాం అని నాయకులు చెప్పడంతో పోచారం ఇంటికి వెళ్లారు.కాగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారు.  తన చిరకాల స్వప్నమైన సిద్ధాపూర్ రిజర్వాయర్ ను ₹106 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ పూరైతే 7,975 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. నిజాంసాగర్ ప్రధాన కాల్వ నుంచి ఎత్తపోతల ద్వారా నీరందించనున్నారు. ఈ వయసులోనూ ఆయన రిజర్వాయర్ పనులను ప్రతి నెలలో ఒకసారి వెళ్లి పర్యవేక్షించారు.