ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని పాతరేయాలి
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, మే 3 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో పాతరపెట్టాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి, గాంధారి మండలాల్లో బీఆర్‌ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మి అన్ని వర్గాలవారు మోసపోయారని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పదేండ్ల బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.




