11 June, 2026 | 1:13 AM

పాక్‌కు పీవోకే సెగ!

11-06-2026 12:00 AM

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను పీవోకేలో చెలరేగిన ఉద్రిక్తతలు మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. నిరసనకారులు, పాక్ భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించడంతో ప్రపంచం దృష్టి మరోసారి పీవోకేపై పడింది. ఈ ఘర్షణలను ఒక ప్రాంతీయ సమస్యగానే చూడలేం. పాక్ నాయకత్వం, పాలనా విధానాలు, సైనిక అణచివేతల పట్ల పీవోకే ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఇవి స్పష్టం చేస్తున్నాయి.

జూలై 27న పీవోకేలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శరణార్థులకు కేటాయించిన 12 స్థానాల అంశంపై తాజాగా మరోసారి నిప్పు రాజుకున్నట్టు తెలుస్తు న్నది. వాస్తవానికి 1947లో భారతదేశ విభజన తర్వాత భారత్ మధ్య జరిగిన యుద్ధం, ఆ తర్వాత 1965 యుద్ధం సందర్భంగా కశ్మీర్ నుంచి పీవోకేకు శరణార్థులుగా వెళ్లిన వారి కోసం ఈ పన్నెండు స్థానాలను కేటాయించా రు. కానీ, పాక్ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పంజాబ్, సింధ్ లాంటి ప్రాంతాలకు చెందినవారితో వీటిని భర్తీ చేస్తున్నది.

ప్రభుత్వ ఏర్పాటులో ఈ స్థానాలు కీలకంగా మారడం, వీటిని అడ్డుపెట్టుకొని పీవోకేపై పాక్ పెత్తనం చెలాయించడంపై స్థానిక ప్రజల్లో మొదటి నుంచి అసంతృ ప్తి ఉన్నది. దీనికితోడు విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఉపాధి అవకాశాలు లేకపోవడం లాంటి అంశాలపైనా పీవోకే ప్రజలు ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతుండటం పాక్ పట్ల పీవోకే ప్రజల వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. చారిత్రకంగా పాక్, పీవోకే ప్రజల సంస్కృతి, సంప్రదాయాల మధ్య స్పష్టమైన వైరుద్ధ్యాలు ఉన్నాయి.

పాకిస్థాన్‌లో పంజాబీ, సింధ్, పఠాన్, బలూచ్ సంస్కృతులు ఉండగా, పీవోకేలో ప్రత్యేక కశ్మీరీ గుర్తింపు భావన ఉంది. ఈ నేపథ్యంలో పీవోకేలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలను కొందరు బలూచిస్థాన్ వేర్పాటువాద పోరాటంతో పోలుస్తున్నారు. అయితే, ఈ రెండు ప్రాంతాల పరిస్థితుల్లో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. బలూచిస్థాన్‌లో సాయుధ వేర్పాటువాద ఉద్యమం చాలాకాలంగా కొనసాగుతుండగా, పీవోకేలో అందుకు విరుద్ధంగా రాజకీయ హక్కులు, ఆర్థికపరమైన అంశాలపై ప్రజా ఆందోళనలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా తమ ప్రాంత వ్యవహారాల్లో పాక్ జోక్యాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకవైపు బలూచిస్థాన్‌లో సాయుధ పోరాటం, మరోవైపు ఆర్థిక సమస్యలు, పాలనలో సైన్యం జోక్యంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ను పీవోకే ఆందోళనలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పక తప్పదు.