10 June, 2026 | 1:00 AM

అట్టుడికిన పీవోకే

10-06-2026 12:00 AM
  1. ఉద్రిక్తతలకు దారితీసిన జేఏఏసీ బంద్ 
  2. చెలరేగిన హింస.. పాక్ సైన్యం కాల్పులు
  3.   ౩౦ మంది మృతి.. 70 మందికి పైగా క్షతగాత్రులు

ఇస్లామాబాద్, జూన్ ౯: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఇచ్చిన బంద్ పిలుపు హింసకు దారి తీసింది. ఆందోళనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ౩౦ మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ కాల్పుల్లో 19 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణులు  మరణించినట్లు తెలుస్తుంది. ఇవే కాల్పుల్లో మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక హక్కుల కోసం మంగళవారం ఉదయం ఆందోళనకారులు రావా లాకోట్ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న జేఏఏసీ బంద్‌కు పిలుపుని వ్వడం, ఆ బంద్‌కు స్థానిక ప్రజలు మద్దతు ఇచ్చి నిరసన చేపట్టడాన్ని అక్కడి యంత్రాం గం సీరియస్‌గా తీసుకున్నది. పాక్ సైన్యం, పారా మిలటరీ బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక జేఏఏసీ కార్యకర్త మృతిచెందాడు. మృతదేహాన్ని పోలీసులు రావాలాకోట్‌లోని ఓ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆసుపత్రి వెలుపల పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు. ఒక దశలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య తోపులాట జరిగింది. చివరకు భద్రతా బలగాలు కాల్పులకు దిగాల్సి వచ్చింది. ఆందోళనలను అణచివేసేందుకు పాక్ భద్రతా సంస్థలు రావా లాకోట్‌ను మోహరించాయి. ఇప్పటివరకు 450 మందికి పైగా నిరసనకారులను, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులను అదుపులోకి తీసుకున్నాయి.

ఆందో ళనలను పీవోకేలో ముందస్తుగా మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశాయి. ఇంతకీ బంద్ ఎందుకంటే.. పీవోకేలో 45 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కశ్మీర్ వెలుపల పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి కోసం 12 స్థానాలను రిజర్వ్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం స్థానిక ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తుందని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది.

దీంతోపాటు రాయితీపై ఆహార పదా ర్థాలు, తక్కువ ధరకు విద్యుత్, రాజకీయ వివక్ష, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం.. వంటి 38 అంశాల అజెండాతో రెండేళ్ల నుంచి పోరాడుతున్నది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పీఓకేలో ఇవే తరహా నిరసనలు జరిగాయి. మరోవైపు, పీవోకేలో భద్రతా దళాల ఊచకోతను భారత విదేశాం గ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్  తీవ్రంగా ఖండించారు. జూలై 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.

బ్రిటన్ ఎంపీల లేఖ

పీవోకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. లండన్‌లోని పాకిస్తాన్ హైకమిష న్ ఎదుట, బ్రాడ్‌ఫోర్డ్‌లోని పాక్ కాన్సులేట్ కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తు న నిరసన కార్యక్రమాలు జరిగాయి. బ్రిటన్ ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ 30 మంది బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు విదేశాంగ శాఖకు లేఖ రాయడం గమనార్హం. మరోవైపు, పీవోకే ఉద్రిక్తతలపై ఆస్ట్రేలియా, కెనడా ప్రభుత్వాలు తమ దేశ పౌరులకు పీవోకే వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశాయి.