ఓటర్లకు పోలీసుల తోడ్పాటు
మహబూబాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఇబ్బందులు పడుతున్న ఓటర్లకు పోలీసులు తోడ్పాటు అందించి వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించారు. మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఓటర్లకు పలుచోట్ల సహకారం అందించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తూ, ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చిన తల్లులకు పోలీసులు తగిన సహాయాన్ని అందజేశారు. దివ్యాంగులను పోలింగ్ కేంద్రం గేటు వద్ద నుండి పోలింగ్ బూత్ వరకు వీల్ చైర్ లలో తీసుకువెళ్లడం, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తిరిగి వారిని బయటకు తీసుకురావడం, చంటి పిల్లలతో వచ్చిన తల్లులు ఓటు హక్కు వినియోగించుకునే వరకు వారి పిల్లలను లాలించడం కనిపించింది.






