పోలీసుశాఖ డాటా చోరీ
హ్యాకర్ అరెస్టు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్ర పోలీసుశాఖకు సంబంధించిన వెబ్‌సైట్ హ్యాక్ కేసులో ఒక ముఖ్యమైన పురోగతి సాధించామని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. హ్యాక్ ఐ, టీఎస్ కాప్ యాప్‌లు, ఎస్‌ఎంఎస్ సర్వీసు పోర్టల్ నుంచి డాటా దొంగిలించిన హ్యాకర్‌ను అరెస్టు చేశామని తెలిపారు. పోలీసు డాటా దొంగిలించి 150 డాలర్లకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్టు గుర్తించిన ఎస్‌బీ అధికారులు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అధునాతన సాధనాలను ఉపయోగించి హ్యాకర్‌ను గుర్తించామని చెప్పారు.
నిందితుడికి సైబర్ క్రైం చరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందని, ఇంతకుముందు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అతని సహచరులను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నామని పేర్కొన్నారు. ఏ ఒక్క వినియోగదారుడుకి సంబంధించిన సున్నితమైన ఆర్థిక డాటా లీక్ కాలేదని చెప్పారు. హ్యాక్ ఐ మొబైల్ అప్లికేషన్ డాటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీలు వంటి వినియోగదారుల సమాచారం మాత్రమే ఉన్నాయని తెలిపారు.
బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హాక్‌ఐ డాటాలోని నిర్ధిష్ట విభాగాల్లోకి హ్యాకర్ యాక్సెస్ పొంది ఉండవచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయెల్, ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, కేవీఎం ప్రసాద్, డీఎస్పీ సంపత్, ఆశిష్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ సురేష్‌లను అభినందించారు.






