12 July, 2026 | 4:34 PM

నెత్తురోడిన రహదారులు

10-06-2024 01:20 AM

రెండు వేర్వేరు రోడ్డు  ప్రమాదాల్లో ఆదివారం ఐదుగురు మృతిచెందారు. 

వనపర్తి జిల్లా పెబ్బేరులో లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు సాధువులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లాలో కారును ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతిచెందింది.

సంగారెడ్డి/ వనపర్తి, జూన్ 9 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నందికంది శివారులోని యూ టర్న్ వద్ద ఆదివారం ఓ కారును ట్యాంకర్ ఢీకొట్టగా ఇద్దరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీజాపూర్ తాలూకా  దేవరిప్పురిగికి చెందిన  హాజీ శబాజ్, తన భార్య సమ్రీన్ బేగం (45), కుమారులు జునైద్, అబ్దుల్లాతో కలిసి కారులో వెళ్తున్నాడు. కారు నాగ్సన్‌పల్లి చౌరస్తా  చేరుకుంటుండగా యూ టర్న్ వద్ద సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న ట్యాంకర్  వేగంగా వచ్చి ఢీకొట్టింది. ట్యాంకర్‌ను మరోలారీ ఢీకొట్టింది. ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మృత్యుంజయ దుబే(45)తో పాటు కారులో ప్రయాణిస్తున్న సమ్రీన్ బేగం అక్కడికక్కడే మృతిచెందారు. శబాజ్, జునైద్, అబ్దుల్లాకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను స్థానికంగా ఓ దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నారు. రోడ్దు ప్రమాదంపై సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లారీ ఢీకొని ముగ్గురు సాధువులు..

 లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డుపై నడిచి వెళ్తున్న ముగ్గురు సాధవులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సాధువులు పెబ్బేర్ నుంచి కర్నూల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి  బెంగళూర్‌కు వెళ్తున్న లారీ వెనుక నుంచి సాధువులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరిని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. సాధువు అశోక్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్టు పెబ్బేర్ ఎస్సై తెలిపారు.