25 July, 2026 | 9:25 PM

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసుల నోటీసులు

13-03-2025 08:20 AM

హైదరాబాద్: బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(MLC Pochampally Srinivas Reddy)కి మరో షాక్ తగిలింది. పోలీసులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం పోలీసులు మాదాపూర్‌లోని శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. మొయినాబాద్ పోలీసులు(Moinabad Police) ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాల కేసులో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు.

రేపు మొయినాబాద్‌ పీఎస్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అంటించారు. గత నెలలో తోల్కట్టలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడిపందేలు, క్యాసినో నిర్వహించారు. ఈ కేసులో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ యజమాని పోచంపల్లిని సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ లీజుకు ఇచ్చానని గతంలో పోచంపల్లి పోలీసులకు వెల్లడించారు. ఫిబ్రవరి 13న మొదటి సారి మొయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.