మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
అపహరణకు గురైన 8 నెలల బాలుడు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత
రివార్డ్ అందజేసిన డీసీపీ సురేష్
మేడిపల్లి, ఆగస్టు 5 (విజయక్రాంతి): మేడిపల్లి పోలీసులు(Medipally Police) 8 నెలల బాలుడి కిడ్నాప్ కేసు కేవలం మూడు గంటల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారాలను, సమన్వయం చేస్తూ దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడిని అపహరించిన మహిళను అదుపులోకి తీసుకుని, చిన్నారిని క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఎన్ ఐ ఎన్ కాలనీలో నివసించే కొట్టే శివరామ్, స్పందనలు నివాసముంటున్నారు . వీరికి 8 నెలల బాలుడు వైష్ణవ్ రుద్రాంశ్ ఉన్నాడు. తమ బాలుడు బుధవారం మధ్యాహ్నం అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిన వెంటనే మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. బాలుడు కనిపించకుండా పోయిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తూ అనుమానితురాలి కదలికలను గుర్తించారు. వేగంగా చేపట్టిన ఆపరేషన్‌లో కేవలం మూడు గంటల్లోనే బాలుడిని అపహరించిన మహిళ నల్లా దుర్గా భవాని (32), గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి చిన్నారిని సురక్షితంగా రక్షించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో నిందితురాలు గతంలో గర్భం దాల్చి శిశువును కోల్పోవడం భర్తకు బాబు చనిపోయాడని తెలియజేయకపోవడంతో భర్త తన కుమారుణ్ణి చూపించమని ఒత్తిడి తేవడంతో నిందితురాలు తీవ్ర మానసిక ఆవేదనకు గురైనట్లు, అదే కారణంతో బాలుడిని అపహరించినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి చిన్నారిని క్షేమంగా రక్షించిన మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఉప్పల్ జోన్ డీసీపీ అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు చూపిన అప్రమత్తత, సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం వల్ల చిన్నారి సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించి కేసు ఛేదించిన సి ఐ జలంధర్ రెడ్డి, ఎస్ ఐ నర్సింగ్ రావు, ఎస్ ఐ శ్రీనివాస్, ఎస్ ఐ శ్రీను, కానిస్టేబుల్ నవీన్, శ్రీకాంత్, రాజు, లకు రివార్డ్ లను ఉప్పల్ డీసీపీ సురేష్ , మేడిపల్లి ఏసిపి మోహన్ కుమార్ అందజేశారు.






