సీఈ, ఎస్‌ఈ, ఈఈలపై క్రిమినల్ చర్యలు
- మిడ్ మానేరు నిర్మాణంలో అవినీతిపై ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫారసు
- ముగ్గురు ఇంజినీర్లను బాధ్యులుగా తేల్చిన విజిలెన్స్
- రూ.240 కోట్లమేర ప్రజాధనం దుర్వినియోగం గుర్తింపు
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మిడ్ మానేరు ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలకు అప్పట్లో ఈ ప్రాజెక్టులో పనిచేసిన సీఈ అనిల్‌కుమార్, ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్‌లే పూర్తి బాధ్యులని, వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ విజిలెన్స్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించింది.
మిడ్‌మానేరు అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు సుమారు రూ. 240 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైందని పేర్కొంటూ.. ఇందుకు బాధ్యులుగా సీఈ, ఎస్‌ఈ, ఈఈలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్‌కు నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన కమిషన్ సుమారు 11 నెలల తర్వాత ఆ సిఫారసులను ప్రభుత్వానికి పంపిస్తూ జూలై నాల్గో వారంలో నివేదించినట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం.
ప్రజావాణిలో ఫిర్యాదు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దశాబ్దకాలం క్రితం నిర్మించిన మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, దీనివల్ల రూ. కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని పేర్కొంటూ స్థానిక నాయకుడొకరు హైదరాబాద్‌లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలకు సంబంధించిన అంశాలను ఆ ఫిర్యాదులో పొందుపర్చారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జి.చిన్నారెడ్డి విచారణ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి పంపించారు.
దీంతో విజిలెన్స్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో మిడ్ మానేరు రిజర్వాయర్‌ను సందర్శించి అక్కడ జరిగిన పనులను పరిశీలించి అనేక సాక్ష్యాధారాలను సేకరించారు. కాగా మిడ్‌మానేరు నిర్మాణం ప్రారంభం నుంచే అక్రమాలు, అవకతవకలకు బీజం పడినట్టుగా విజిలెన్స్ విభాగం విచారణలో బయటపడ్డట్టు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వంలో కీలకమైన ఒక నేత బినామీకి పనులు అప్పగించడం కోసమే.. రిజర్వాయర్ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థను పక్కనపెట్టి.. వేరే కాంట్రాక్టు సంస్థకు సగం పనిని అప్పగించడంతో అవినీతికి బీజం పడినట్టుగా విజిలెన్స్ గుర్తించింది.
ఇందులో కీలక పాత్రను అప్పటి సీఈ, ఎస్‌ఈ, ఈఈలు పోషించినట్టుగా విజిలెన్స్ విభాగం గుర్తించినట్టు సమాచారం. రెండు కాంట్రాక్టు సంస్థలు చేస్తున్న పనులను సమాంతరంగా పర్యవేక్షించకుండా.. నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంజినీరింగ్ అధికారులు వ్యవహరించడంతోనే అప్పట్లో మిడ్‌మానేరు కట్ట కొట్టుకుపోయినట్టుగా విజిలెన్స్ విచారణలో బయటపడినట్టు సమాచారం. వాస్తవానికి అప్పట్లో.. పై నుంచి భారీ వరద రావడంతో మిడ్‌మానేరు కొట్టుకుపోయినట్టుగా ప్రచారం జరిగింది.
అయితే రెండు కాంట్రాక్టు సంస్థలు సమాంతరంగా పనులు చేయకపోవడం వల్ల, వీటిని ఇంజినీరింగ్ అధికారులు సరిగా సమన్వయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మిడ్‌మానేరు కొట్టుకుపోయినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలినట్టు సమాచారం. విచారణలో భాగంగా.. విజిలెన్స్ విభాగం అధికారులు.. మిడ్‌మానేరు నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను పరిశీలించి, అప్పుడు వాడిన మెటీరియల్, మట్టి నమూనాలను కూడా సేకరించారు.
నిర్మాణ సమయంలో ఎక్కడ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.. అందుకు బాధ్యులు ఎవరు అనేది గుర్తించినట్టు తెలుస్తుంది. ఇలా మొత్తంగా సుమారు రూ.240 కోట్ల వరకు ప్రజాధానం దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విచారణలో బయటపడింది. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీఈ అనిల్‌కుమార్, ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్‌లు దీనికి పూర్తిగా బాధ్యులని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ విభాగం నివేదికలో సిఫారసు చేశారు.
దీనిని పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ అదే సిఫారసును ప్రభుత్వానికి పంపించింది. మిడ్‌మానేరు నిర్మాణ సమయంలో సీఈగా అనిల్‌కుమార్ బాధ్యతలు నిర్వర్తించి తరువాత ఆయన ఈఎన్‌సీగా పదోన్నతి పొందారు. మిడ్‌మానేరుపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న సందర్భంలో విజిలెన్స్ విచారణకు ఆటంకం కలిగించేలా అప్పటి ఈఎన్‌సీ అనిల్‌కుమార్ శాఖాపరంగా పలు బదిలీలు చేశారు.
ఈ బదిలీల వల్ల తాను సీఈగా ఉన్న మిడ్ మానేరు విచారణ తనకు అనుకూలంగా జరిగేలా ప్రయత్నం చేశారనే ఆరోపణలుకూడా అప్పట్లో వచ్చాయి. దీనితో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, అప్పటి విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిల మధ్యన లేఖల యుద్ధం జరిగినట్టుగా నీటిపారుదల శాఖలోనూ చర్చజరిగింది. తరువాత అనిల్‌కుమార్ ఈఎన్‌సీగా తప్పించి రిటైర్డ్ అయ్యేరోజు వేరేచోట పోస్టింగ్ ఇచ్చి పంపించారు.
ఇక మిడ్‌మానేరు నిర్మాణ సమయంలో ఎస్‌ఈ, ఈఈలుగా పనిచేసిన శ్రీకాంత్‌రావు, అశోక్‌కుమార్‌లుకూడా కొంత కాలం క్రితం రిటైర్డ్ అయ్యారు. ఈ ముగ్గురు ఇంజనీర్లే మిడ్‌మానేరు అక్రమాల వ్యవహారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో ఇప్పుడు రిటైర్డ్ అయిన ముగ్గురిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకుంటుందా.. లేదా అనేది తేలాల్సి ఉంది.
తాజాగా విజిలెన్స్ కమిషన్ నుంచి వచ్చిన నివేదిక నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వారా చీఫ్ సెక్రెటరీకి.. ఆపై నీటిపారుదల శాఖ మంత్రికి, చివరికి ముఖ్యమంత్రికి చేరుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఈ సిఫారసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిని బట్టే.. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు అవకాశం ఉంటుంది.






