6 August, 2026 | 2:46 AM

జోక్యం చేసుకోండి

06-08-2026 01:41 AM
  1. తుమ్మిడిహట్టిపై తెలంగాణ-, మహారాష్ట్రల మధ్య భేటీ ఏర్పాటు చేయండి
  2. జలశక్తి మంత్రి పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
  3. పీఎంకు రాసిన లేఖ.. పీఎంవో స్పందనపై చర్చ
  4. చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపిన సీఆర్ పాటిల్
  5. పాలమూరు-, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వండి
  6. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరిన సీఎం

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను, అలాగే పాలమూరు-- -రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూ రు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం వివరించారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు కోరుతూ ప్రధాని మోదీ కి తాను రాసిన లేఖ, దానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జల్‌శక్తికి పంపిన లేఖ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి జలశక్తి మంత్రితో ప్రస్తావించారు.

తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తుచేశారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఎత్తుతో బరాజ్ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) అధ్యయనం నిర్వహించిందని కూడా వివరించారు. ఈ అధ్యయనం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించినా, 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించినా ముంపులో పెద్దగా తేడా లేదని స్పష్టమైందన్నారు.

ముంపులోనూ 50 శాతం నదీగర్భం (రివర్ బెడ్)లోనే ఉంటుందని కేంద్రమంత్రి పాటిల్‌కు సీఎం వివరించారు. 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా కావల్సినంత నీరు సరఫరా చేయలేమన్నారు. కాబట్టి 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రను వీలైనంత త్వరగా ఒప్పించాలని కేంద్రమంత్రి పాటిల్‌ను సీఎం కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పూర్తిగా వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటి వసతి ఏర్పడుతుందని సీఎం వివరించారు.

పీఎం ఆఫీసు నుంచి లేఖ అందింది: సీఆర్ పాటిల్  

ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి లేఖ అందిందని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు. ఈ అంశంపై మొదట కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి, తొలుత తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని పాటిల్ తెలియజేశారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎం అనిల్‌యాదవ్, డాక్టర్ కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ పాల్గొన్నారు.

పర్యావరణ అనుమతులు ఇవ్వండి

పాలమూరు- గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. భూపేంద ర్ యాదవ్‌తో రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసి పార్లమెంట్‌లో సమావేశమయ్యారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేయా లని కేంద్ర మంత్రి భూపేందర్‌ను కోరారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగ్ప రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధులను వ్యయం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయా యని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని కేంద్ర మంత్రికి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు సానుకూలత నేపథ్యంలో ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని భూపేందర్ యాదవ్‌ను కోరారు.