26 June, 2026 | 1:45 AM

హత్య కేసును ఛేదించిన పోలీసులు

26-06-2026 12:00 AM

చేగుంట, జూన్ 25 :  చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన చిన్న శంకరంపేట్ మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం రామయంపేట్ సర్కిల్  కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ..జూన్ 22న శంకరంపేట్(ఆర్) మండలం సూరారం గ్రామానికి చెందిన 22 ఏళ్ల యాట శ్రీధర్ను,ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనలో చేగుంట పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. తూప్రాన్ డి.ఎస్.పి నరేందర్ గౌడ్  వివరాల ప్రకారం...

ఆటో కొనుగోలు వ్యవహారంలో ఏర్పడిన ఆర్థిక వివాదం, అలాగే కుటుంబ విభేదాల కారణంగా నిందితులు శ్రీధ్ప కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో జూన్ 22న రెండు ఆటోల్లో వెంబడించి, అనంతసాగర్ బస్ స్టాప్ సమీపంలోని శివాజీ విగ్రహం వద్ద శ్రీధర్ ప్రయాణిస్తున్న బైక్ను ఉద్దేశపూర్వకంగా ఆటోతో ఢీకొట్టారు. ఈ ఘటనలో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందగా, బ్పై ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.మృతుడి తల్లి యాట శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు,

ప్రధాన నిందితుడు రణబోయిన ప్రభుతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన రెండు ఆటోలు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. తూప్రాన్ డీఎస్పీ జె. నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో కేసును త్వరితగతిన ఛేదించిన రామాయంపేట సీఐ సైదా, చేగుంట ఎస్‌ఐ చైతన్య రెడ్డి, ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.