వైన్స్ షాపు చోరీ కేసును చేదించిన పోలీసులు
దొంగల అరెస్టు,రిమాండ్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్ట్ 25: అర్వపల్లిలోని రిషిత వైన్స్-1లో ఈనెల 21(శుక్రవారం)అర్ధరాత్రి దాటిన తర్వాత వైన్స్ షాపు షెట్టర్ ను రాడుతో పైకి లేపి చోరీకి పాల్పడిన విషయం విదితమే.అట్టి నిందితుల వివరాలను అర్వపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ నాగేశ్వరరావు,ఎస్ఐ మధులు వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం అర్వపల్లిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాలను తనిఖీ చేస్తుండగా పిన్నోజు రవి,అనపర్తి దుర్గయ్య,కర్కాని నరేష్ లు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా వైన్స్ షాపులో జరిగిన నేరాన్ని ఒప్పుకున్నారు.వారి వద్ద నుంచి 3ఫుల్ బాటిల్లు,రూ 17200 నగదు,ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.రవి,దుర్గయ్యలు ఇటీవల జైల్లో పరిచయం ఏర్పడగా జైలు నుంచి విడుదలైన అనంతరం రిషిత వైన్స్-1లో రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు.ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సుదీర్,లింగయ్య,కృష్ణ,శ్రీకాంత్,బాలకృష్ణ,శ్రీను,రేణుక తదితరులు ఉన్నారు.






