26 August, 2026 | 10:07 AM

వెల్దుర్తి–మెదక్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది!

26-08-2026 09:02 AM

వెల్దుర్తి,ఆగస్టు 26,(విజయక్రాంతి): వెల్దుర్తి–మెదక్ ప్రధాన రహదారి దుస్థితితో దాదాపు 40 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు నిత్యం ప్రయాణ కష్టాలు పడుతూ ప్రమాదాల భయంతో రాకపోకలు సాగిస్తున్నారు. 2021లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి–మెదక్ రహదారి నిర్మాణం కోసం సుమారు ₹18 కోట్లు మంజూరైనప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రహదారి నిర్మాణంపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వెల్దుర్తి–మెదక్ రహదారిని వెంటనే డబుల్ రోడ్డుగా మంజూరు చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలనే డిమాండ్‌తో వెల్దుర్తి మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపడుతున్నట్లు బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.  ఆగస్టు 31, సోమవారం వెల్దుర్తి మండల కేంద్రం నుంచి మెదక్ జిల్లా కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర ఉంటుందన్నారు.వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, యువత, రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాపాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, ప్రతాప్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శాకారం శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.