పచ్చదనమే ప్రగతికి బాట
వనమహోత్సవంలో భాగంగా రాంపురం తండాలో కలెక్టర్, ఎస్పీ మొక్కలు నాటిన వైనం
మోతె,ఆగస్టు 26 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్(Collector Tejas Nandalal Pawar), ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. వనమహోత్సవంలో భాగంగా సూర్యాపేట జిల్లా మోతె మండలం రాంపురం తండాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించడంతోపాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటికి క్రమం తప్పకుండా నీరు అందిస్తూ సంరక్షించాలని సూచించారు.
గ్రామాల్లో ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాలు, రహదారుల వెంట మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.కాలుష్య నియంత్రణ, వాతావరణ సమతుల్యతకు చెట్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వనమహోత్సవాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్, తాసిల్దార్ వెంకన్న, ఎంపీడీవో సందీప్ కుమార్, ఎం పి ఓ వంశీకృష్ణ, ఏపీఎం మంజుల, ఏ పీ ఓ నగేష్, ఈసీ శ్రీహరి, సీసీ ఉపేందర్, సర్పంచ్ బానోతు సత్యమ్మ శ్రీను, ఉపసర్పంచ్ ఆంగోతు శైలజ మోహన్, లక్ముడు, భూక్య మహేందర్, భూక్య సురేందర్, బానోతు బానోతు రమేష్, గ్రామ కార్యదర్శులు, టి ఏ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.






