కేతన్ హత్య.. సీన్ రీక్రియేషన్
లోహ్‌గఢ్ కోటకు సియా, చేతన్‌ను తీసుకెళ్లిన పోలీసులు
పక్కాగా సాంకేతిక ఆధారాల సేకరణకు ప్రయత్నం
పుణె, జూన్ 28: ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ అనుమానాస్పద మృతి కేసులో పుణె పోలీసులు ఆదివారం సీన్ రీక్రియేట్ చేశారు. ప్రధాన నిందితురాలైన సియా గోయల్, సహకరించిన చేతన్ చౌదరిలను ఉదయం 6.30 గంటల ప్రాంతంలో లోహ్‌గఢ్ కోట వద్దకు తీసుకువచ్చారు. కేతన్ చనిపోవడానికి ముందు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
ఒక డమ్మీ బాడీని కూడా పోలీసులు లోహ్‌గఢ్‌కు తీసుకువెళ్లారు. సియా ఆమె ప్రియుడు చేతన్‌లతో విడివిడిగా సీన్ రీక్రియేట్ చేశారు. రెండున్నర గంటల పాటు సీన్ రీక్రియేషన్‌కు సమయం పట్టింది. కాగా పోలీసుల విచారణలో కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు సియా అంగీకరించిందని వార్తలు వెలువడ్డాయి.
మరోవైపు రెండో నిందితుడు చేతన్‌కు చెందిన బైక్, ఫోన్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపుతామని తెలిపారు. చేతన్ తన ఫోన్‌లోని వివరాలన్నీ డిలీట్ చేశాడని, వాటిని రికవరీ చేస్తామన్నారు. అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని సియాగోయల్ పెళ్లిని రద్దు చేస్తే కుటుంబం పరువు పోతుందని భావించి కేతన్‌ను చేతన్ చౌదరితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 18న పుణెలోని లోహ్‌గఢ్ కోటను సియా, కేతన్ సందర్శించారు. ఆ సమయంలో కేతన్ లోయలో పడి మృతి చెందాడు. కాబోయే భర్తను హత్య చేశారన్న ఆరోపణలపై సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరీని పోలీసులు అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.






