25 March, 2026 | 2:49 AM

మైసిగండి ఆలయ ట్రస్ట్ ఏర్పాటుకు ‘రాజకీయ’ ముళ్లకంచె

25-03-2026 01:10 AM
  1. నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలలైనా అడుగు పడని వైనం 

తెరవెనుక చక్రం తిప్పుతున్న నేతలు?

రంగారెడ్డి, మార్చి 24 (విజయక్రాంతి): దక్షిణ తెలంగాణ కాశీగా, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కడ్తల్ మండలం మైసిగండి మైసమ్మ దేవస్థానం చుట్టూ ఇప్పుడు రాజకీయ సెగలు రాజుకుంటున్నా యి. వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ క్షేత్రం లో అభివృద్ధి పరుగులు పెట్టాల్సింది పో యి, పాలక మండలి (ట్రస్ట్ బోర్డు) ఏర్పాటు ప్రక్రియ ’అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా, ఆదాయం పెరిగినా.. బోర్డు ఏర్పాటు కాకపోవడం వెనుక పెద్ద ఎత్తున ’రాజకీయ క్రీడ’ సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదాయం ’కోటి’ దాటినా.. అధీకృత పాలన ఏది?

గతంలో ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉండేది. కానీ, భక్తుల తాకిడి పెరగడంతో ప్రస్తుతం ఆదాయం రూ. కోటి మార్కును దాటింది. దీంతో నిబంధనల ప్రకారం ఈ ఆలయానికి ’6A’ హోదా లభించింది. ప్రభుత్వ నిబంధనలో ప్రకారం 6A హోదా కలిగిన ఆలయాలకు 14 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలి ఉండాలి.దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశాలతో గత ఏడాది సెప్టెంబర్ 16న నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది.నోటిఫికేషన్ వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా, నేటికీ కొత్త బోర్డు కొలువుదీరలేదు.తెర వెనుక అసలు కథ వేరే ఉంది అని గుసగుస లు వినిపిస్తున్నాయి.

పెత్తనం కోసమేనా ఈ పంతం?

మైసిగండి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.... కాకపోవడం వెనుక స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం బలంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ట్రస్ట్ బోర్డు ఏర్పడితే ఆలయ నిధులు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టులపై పారదర్శకత పెరుగుతుంది. ఇది తమ అనుచరుల ఆర్థిక ప్రయోజనాలకు గండి కొడుతుందని కొందరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

బోర్డు సభ్యులదే అం తిమ నిర్ణయం కావడంతో, అధికారులపై తమకున్న పట్టు సడలిపోతుందనే భయం స్థానిక నేతల్లో కనిపిస్తోంది.ట్రస్టు బోర్డు ఏ ర్పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి సానుకూలత ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు అధికారుల చేతులను కట్టేస్తున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయస్థానం మెట్లు ఎక్కిన ‘ఫౌండర్ ఫ్యామిలీ’

ఈ జాప్యంపై ఆలయ ఈఓ స్నేహలతను వివరణ కోరగా, మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆలయ ఫౌండర్ ట్రస్ట్కు సంబంధించిన కుటుంబ సభ్యులు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయవద్దంటూ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీనివల్లనే ప్రక్రియ స్తంభించిందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ కోర్టు కేసుల వెనుక కూడా రాజకీయ శక్తుల ప్రేరేపణ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అభివృద్ధికి బ్రేకులు.. భక్తుల ఆవేదన..

పాలక మండలి లేకపోవడంతో ఆలయ అభివృద్ధి కుంటుపడుతోంది. భక్తులకు కనీస వసతులు, క్యూలైన్ల నిర్వహణ, నిత్య అన్నదాన పథకం వంటి కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ’అధికారిక బోర్డు’ లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి రాజకీయ జోక్యాన్ని పక్కన పెట్టి, మైసిగండి అమ్మ వారి కీర్తిని పెంపొందించేలా త్వరితగతిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని సామాన్య భక్తులు కోరుతున్నారు.