ఢిల్లీలో వేడెక్కుతున్న రాజకీయం
* ఆప్ ఎన్నికల హామీపై విచారణ జరపండి
* అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం
* కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదు
* బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయి: కేజ్రీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఎన్నికల వేళ ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఆప్ ఇచ్చిన తప్పుడు హామీలు ఇస్తోందని, కాంగ్రెస్ అభ్యర్థుల నివాసాల దగ్గర పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారని ఆరోపిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు, సీఎస్‌కు, పోలీస్ కమిషనర్‌కు కాంగ్రెస్ నేత, ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఆరోపణపై విచారణ జరపాలని అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు.
మహిళా సమ్మాన్ యోజన, సంజీవని పథకాలను ప్రభుత్వం నోటిఫై చేయకున్నా నిబంధలనకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ముందు సంక్షేమ పథకాల విషయంలో ఆప్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని సందీప్ తన ఫిర్యాదులో వివరించారు. మహిళలకు రూ.2,100 ఇచ్చే పథకాన్ని సీఎం అతిశీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు..
అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల ఇంటి వద్ద పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారన్న అంశంపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదికను అందజేయాలని పోలీస్ కమిషనర్‌ను ఎల్‌జీ కార్యాలయం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ నుంచి ఢిల్లీకి నగదు తరలిస్తున్నారని సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్నికల అధికారులకు తెలి యజేయాలని సీఎస్‌ను ఎల్‌జీ కోరారు.
ఆప్‌ను అడ్డుకునే ప్రయత్నాలు: కేజ్రీ
ఢిల్లీలో తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ఎల్జీ కార్యాలయం విచారణకు ఆదేశించడంపై ఆప్ అధినేత స్పందించారు. ఇవన్నీ తమను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలని మండిపడ్డారు.






