calender_icon.png 11 February, 2026 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ ప్రశాంతంగా జరగాలి

11-02-2026 01:16:11 AM

  1. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు 

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందర్శించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ 

మెదక్, ఫిబ్రవరి 10(విజయ క్రాంతి) :మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.

సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్ళను సైతం పరిశీలించిన కలెక్టర్, సీ.సీ టీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకను కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, సకాలంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉండాలన్నారు. సదుపాయాల కల్పన విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని అన్నారు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తతో ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి , జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.