8 August, 2026 | 3:06 PM

చెరువు మట్టినీ వదలట్లే!

26-05-2024 02:19 AM

జయశంకర్ భూపాలపల్లి, మే26 (విజయక్రాంతి): అక్రమార్కులకు కాదేది అనర్హం అన్నట్లుగా గ్రామాలకు కల్పతరువుగా ఉండే చెరువుల్లోని మట్టిని అక్రమార్కులు వదలడం లేదు. ఇసుక, ఎర్రమట్టిలాంటి దందాలు కొనసాగుతున్న నేపధ్యంలో తాజాగా చెరువుల్లోని నల్ల మట్టిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేం దర్జాగా చెరువుల్లోని మట్టిని జేసీబీలతో తోడి ట్రాక్టర్లతో జోరుగా వ్యాపారం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో మట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూసిన దాఖాలాలు కన్పించడం లేదు. ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ. వెయ్యి నుంచి రూ. 2వేల చొప్పున అమ్ముతున్నారు. కిలోమీటర్ల దూరా న్ని బట్టి రేటు కూడా మారిపోతుంది. ఆయా గ్రామాల్లోని చెరువుల్లోని నల్లమట్టిని జేసీబీల సాయంతో తోడించి రైతుల అవసరాలకు అమ్ముతున్నారు. అంతే కాకుండా కొన్ని చెరువుల్లో మొరం వస్తే ఆ మొరాన్ని నూతనంగా ఇండ్లు నిర్మించుకునే వారికి, ఖాళీ స్థలాలను చదును చేసుకోవడానికి అమ్ముతున్నారు. 

ప్రమాదాలకు నిలయం 

చెరువుల్లో జేసీబీలతో మట్టిని తీయడంతో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడుతున్నా యి. వర్షాకాలంలో చెరువులు నిండిన తర్వాత ఎవరైనా ప్రమాదవశాత్తు అందులో పడితే ఆ గొయ్యిలో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతున్న క్రమంలోనే అధికారులు చెరువుల్లో జేసీబీలతో తవ్వకాలకు ఆనుమతులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.  చెరువుల్లో ఇష్టానుసారంగా మట్టిని తీయడం వల్ల అనేక నష్టాలు ఉన్నా అధికారుల్లో మాత్రం చలనం కన్పించడం లేదు. అనుమతులులేకుండా జేసీబీలతో చెరువుల్లో తీసిన గొయ్యిల్లో ఎవరైనా ప్రమాద వశాత్తు పడి మరణిస్తే అందుకు బాద్యత ఎవరు వహిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుల్లో అనుమతులు లేకుండా మట్టిని జేసీబీలతో తవ్వించి ఆ మట్టితో సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.