8 August, 2026 | 1:49 PM

లంకె బిందెల పేరుతో లక్షలు దోచారు

26-05-2024 02:23 AM

రాజన్న సిరిసిల్ల, మే 25, (విజయక్రాంతి): లంకె బిందెలు దొరికి లక్షలకు లక్షలు డబ్బులొస్తాయంటే గుడ్డిగా నమ్మింది. ముగ్గురు కేటుగాళ్ల మాటల గారడీకి పడిపోయి అక్షరాల రూ.30 లక్షల సొమ్ము అప్పగించింది. బాధితురాలు చివరకు తాను మోసపోయానని పోలీసులను ఆశ్రయించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో లంకె బిందెల బాగోతం వెలుగు చూసింది. పట్టణ సీఐ వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని హన్మక్కపల్లికి చెందిన సింగారపు అంజవ్వ ఏడాదిన్నర నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతో  సమీప బంధువు ఎల్లయ్య ఆమెను పరామర్శించి చంద్రగిరిలో మహిపాల్ అనే పూజారి ఉన్నాడని, అతని వద్ద నాటు వైద్యం చేయించుకుంటే బాగుంటుందని సూచించాడు.

దీంతో అంజవ్వ వైద్యం కోసం మహిపాల్ వద్దకు వెళ్లింది. ఆమెను మాటల్లో పెట్టి మహిపాల్ తన తల్లిగారి ఊరు కోనాయపల్లిలో లంకె బిందెలు ఉన్నాయని, వాటిని తవి తీస్తే పెద్ద ఎత్తున బంగారం లభిస్తుందని నమ్మబలికాడు. కానీ తవ్వించడానికి తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. లంకె బిందెలు దొరికిన తర్వాత వాటాలు వేసుకుందామని చెప్పడంతో అంజవ్వ నమ్మి రూ.20 లక్షల నగదును మహిపాల్ కు అప్పగించింది. ఈ క్రమంలో సుద్దాల గ్రామానికి చెందిన అబ్రహం లంకె బిందెల్లోని బంగారం కడిగి ఇస్తానని నమ్మబలికాడు. అంజవ్వ దీంతో రూ.10 లక్షలు ముట్టజెప్పింది. మహిపాల్, అబ్రహం చెప్పినవేవీ జరుగకపోవడంతో అంజవ్వ విసిగి వేసారి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎల్లయ్య, మహిపాల్, అబ్రహాన్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.