22-01-2026 12:05:16 AM
మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి
చెన్నూర్, జనవరి 21: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని, మంత్రి వివేక్ వెంకట స్వామి తన కుటుంబ సభ్యుల పదవుల కోసం తమను వాడుకొని ప్రస్తుతం చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను మరిచారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మూల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చెన్నూర్ నుంచి హైదరాబాద్‌కు వేల మందితో వెళ్లే ముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదని, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో నెల రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరితే తామంతా పార్టీ కోసం, ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేసి గెలిపించుకున్నామని, ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుచున్న వివేక్ కొడుకు వంశీకృష్ణను గెలిపించుకున్నామన్నారు. వివేక్ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే చూసుకున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, ఎమ్మెల్యేగా తన సొంత హామీల్లో ఒక్కటి నెరవేర్చకుండా నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఇస్తానన్న 45 వేల ఉద్యోగాలు ఏవని, ఫ్యాక్టరీల ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. రెండేండ్లుగా ఒక్క హామీ అమలు కాలేదని, అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా జరిగిందేమి లేదన్నారు. అనంతరం హైదరాబాద్ లోని బీఆర్‌ఎస్ భవన్ కు సుమారు 200 కార్ల కాన్వాయ్‌తో రెబల్ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకునేందుకు బయలుదేరి వెళ్లారు.