తొలిసారి సానుకూలమే
- గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వానికి మద్దతు
- కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వానికి, గవర్నర్లకు మధ్య వివాదం
- అందుకు భిన్నంగా తెలంగాణలో సహకార ధోరణి
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారం భం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన తొలి ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలను ప్రస్తావిస్తూ సానుకూల ధోరణి ప్రదర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ వాటి అమలు దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సాధారణంగా కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎన్నికైన ప్రభుత్వాల మధ్య విభేదాలు తరచూ కనిపిస్తుంటాయి.
ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ పాత్రపై వివాదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. అయితే తెలంగా ణలో మాత్రం ఇప్పటివరకు అలాంటి ఘర్షణాత్మక పరిస్థితులు కనిపించకపోవడం గమనార్హం. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్-ప్రభుత్వ సంబంధాలు ఉద్రిక్తంగా మారా యి. కేరళలో గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ మధ్య పలు అం శాలపై తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి.
విశ్వవిద్యాలయాల నియామకాలు, బిల్లుల ఆమోదం వంటి అంశాలపై తరచూ వివాదాలు చెలరేగాయి. తమిళనాడులో గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య కూడా అసెంబ్లీ ప్రసంగం, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల ఆమోదం వంటి విషయాలపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ సీవీ ఆనందబోస్, సీఎం మమతా బెనర్జీ మధ్య కూడా పలు సందర్భాల్లో పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇప్పటివరకు సహకార ధోరణి కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రస్తావించబ డటం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు.
గవర్నర్ రాజకీయంగా ఏబీవీపీ వంటి జాతీయవాద సంస్థల నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పరిపాలనా స్థాయిలో సహకారం కొనసాగిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రాజ్యాంగపరంగా గవర్నర్ పాత్ర తటస్థంగా ఉండాలని భావించే నేపథ్యంలో తెలంగాణలో కనిపిస్తున్న ఈ ధోరణి పరిపాలనా వ్యవస్థకు అనుకూలంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ గవర్నర్-ప్రభుత్వ సంబంధాలు సహకారపూర్వకంగా కొనసాగితే పరిపాలన సజావు గా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఉద్రిక్త పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న సమన్వయం ప్రత్యేకంగా కనిపిస్తోందని వారు వ్యాఖ్యా నిస్తున్నారు.




