గిరిజన గర్భిణి దారుణ హత్య
పెంచికల్పేట్, మార్చి 16 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో గర్భిణీ గిరిజన మహిళ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సమ్మక్క (25) అనే గిరిజన మహిళను జైహిందుపూర్‌కు హామ్లెట్‌కు చెందిన కెల్కరి జలపతి అనే వ్యక్తి అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు వెల్లడైంది. సమ్మక్క ఏడో నెల గర్భిణీగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరి మధ్య గత నాలుగేళ్లుగా సన్నిహిత సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వివాహం అయిన జలపతిని తనను వివాహం చేసుకోవాలని సమ్మక్క కోరుతూ ఉండడంతో శనివారం ఆమెను జైహింద్పూర్ ప్రాంతానికి పిలిచి కొండపల్లిసులుగుపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితుడు జలపతి తన సోదరుడికి ఫోన్ చేసి విషయం తెలిపినట్లు సమాచారం. దాంతో అతని సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా అటవీ ప్రాంతంలో సమ్మక్క మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్ (టి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు జలపతిపై హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కాగజ్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.




