అడుగుకో గుంత.. ప్రయాణానికి చింత!
నాలుగు జిల్లాలకు అనుబంధ రహదారి
మూలమలుపులు, గుంతలతో ఇక్కట్లు
ప్రయాణికుల్లో ప్రమాద ఘంటికలు
అధికారులు స్పందించాలని విజ్ఞప్తులు
కామారెడ్డి, మే 31 (విజయక్రాంతి): నాలుగుజిల్లాలకు అనుబంధంగా ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో మరింత దుర్భరంగా మారుతోంది. మూలములుపులు, రోడ్డు మీద గుంతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నిత్యం అదే రహదారి గుండా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏనాటికైనా ఆ రోడ్డును మెరుగుపరుస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు.
నాలుగు జిల్లాలకు సులువుగా...
జాతీయ రహదారి నెంబర్ 44 మీదుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనువుగా ఉన్న అంతర్ జిల్లా రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ రోడ్డు గుండా నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాతో పాటు రాజన్న సిరిస్లిల, సిద్దిపేట జిల్లాలకు త్వరగా వెళ్లొచ్చు. జిల్లాలోని కామారెడ్డి నుంచి రామారెడ్డి, రెడ్డిపేట్, రెడ్డిపేట్ తండా, స్కూల్ తండా, లెఫ్ట్ తండా, రైట్‌తండా మీదుగా సిరికొండ మండలం తూంపల్లి మీదుగా కమ్మర్‌పల్లి, మోర్తాడ్, భీమ్‌గల్ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు ఈ రోడ్డు గుండానే వెళ్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై పర్యవేక్షణ లేకపోవడంతో అధ్వానంగా మారి ప్రయాణీకులకు నరకకూపంగా తయారైంది. వాహనాలు అదుపుతప్పి పలువురు మరణించగా, గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి.
ప్రమాదాలకు నెలవు
కామారెడ్డి సిరికొండ గ్రామాలకు వెళ్లాలంటే అటవీ ప్రాంతం మీదుగా సాగే రోడ్డులో తొమ్మిది చోట్ల ప్రమాదకరమైన మూల మలుపులు ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో వర్షాకాలంలో వరదలకు చాలా చోట్ల రోడ్డు ఇరువైపులా మట్టి కొట్టుకపోయి, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు మార్గంలో ఒకవైపు ప్రమాదకరంగా మూలమలుపులు ఉండగా, అదే చోట మట్టి కోతకు గురై రోడ్డుకు ఇరువైపులా భారీగా గుంతలు ఉండడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటవీ ప్రాంతం మధ్యలో ఒర్రెపై నిర్మించిన కల్వర్టు వద్ద వరద రోడ్డు పై నుంచి నీరు ప్రవహించడంతో సగభాగం వరకు కోతకు గురైంది. ఈ అటవీ ప్రాంతంలో చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులు ఉన్నాయి. సాయంత్రం నుంచి ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారికి చిరుతలతో పాటు ఇతర వన్య ప్రాణులు తారసపడుతుంటాయి.
గడ్‌కోల్, తూంపల్లి, కొండాపూర్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రయాణీకులకు ఈ మార్గంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొండాపూర్ వైపు నుంచి వెళ్తుండగా వచ్చే తొలి మూల మలుపు వద్ద గత మూడు ఏళ్ల కిందట బైక్ వంతెనను ఢీ కొన్న ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. ఇదే మూల మలుపు వద్ద మరొక వ్యక్తి బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. అటవీ ప్రాంతంలో ఆర్టీసి బస్సు ఢీ కొన్న ఘటనలో భీంగల్ మండలం గొనుగొప్పులకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన మరో యువకుడు బైక్ వస్తూ రోడ్డు ప్రక్కన గుంతలో పడి మృతి చెందాడు. రోడ్డు ప్రమాదాలలో పది మంది వరకు ఇప్పటికి మృత్యువాత పడ్డారు. ప్రమాదాలకు నెలవుగా మారిన ఈ రోడ్డులో విస్తరించి, మూల మలుపులను తొలగించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
ఈ రోడ్డుతో ఇబ్బందులు అనేకం
కామారెడ్డికి వెళ్లే రోడ్డు మార్గం కొండాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న సింగిల్ లైన్ రోడ్డుపై ప్రయాణించాలంటే ఎన్నో ఇబ్బంధులు పడుతు న్నాం. గ్రామం నుంచి ప్రతిరోజు వం దల మంది ఏదో ఒక పనిపై ఈ రోడ్డు గుండానే కామారెడ్డికి వెళ్తున్నాము. రోడ్డును విస్తరించకపోవడంతో ప్రమాదాలు జరిగి, ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే, గాయాలపాలు అవుతున్నారు. అధికారులు స్పందించి, రోడ్డును విస్తరిస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది. అధికారులు, ప్రజాప్రనిధులు స్పందించి, రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి.
-రాము, రెడ్డిపేట్ గ్రామస్తుడు
అటవీ శాఖ వల్లే పనులు కాడవం లేదు
కామారెడ్డి సరిహద్దుల్లో అటవీ ప్రాంతం ఉండడంతో రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. రోడ్డు విస్తరణకు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి పంపించాము. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైయ్యాయి. రోడ్డు విస్తరణకు అటవీ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో మంజూరైన నిధులు రద్దయ్యాయి. అటవీ శాఖ నుంచి అనుమతులు లభిస్తే రోడ్డు నిర్మాణం పనులు చేపడతాం. రెండు జిల్లాల ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ సమావేశాల్లో సైతం రోడ్డు పనులు చేపట్టాలని కోరారు.
-రవి శంకర్, ఆర్ అండ్ బి ఈఈ, కామారెడ్డి
సింగిల్‌రోడ్డుతో సమస్యలు..
హైదరాబాద్ వైపు వేళ్లే ప్రయాణీకులు కొండాపూర్ మీదుగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట తండా వరకు దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళ్లాల్సి ఉంటోంది. అటవీ ప్రాంతానికి అటు, ఇటూ వైపు ఉన్న రోడ్డు డబుల్ లేన్‌గా విస్తరించినప్పటికి 9 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో సింగిల్ రోడ్డుగానే ఉంది. ఈ 9కి.మీ. రోడ్డు విస్తరణకు అటవీ శాఖ అనుమతించలేదు. ఇదిలాఉండగా, సింగిల్ రోడ్డులో అరకిలోమీటరు మినహా మిగతా భాగం కామారెడ్డి జిల్లా ఆర్‌అండ్ బీ పరిధిలోకి వస్తుంది.. కొండాపూర్, తూంపల్లి, ముషిర్‌నగర్, గడ్‌కోల్, తాళ్లరామడుగు, సిరికొండ గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తారు. ఈ రోడ్డు కామారెడ్డి, నిజామాబాద్ రెండు జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లాలోని అర్బన్ నియోజకవర్గాల పరిదిలో ఉండడంతో రోడ్డు విస్తరణకు మోక్షం లభించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






