22 May, 2026 | 4:38 PM

దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

22-05-2026 03:33 PM

న్యూఢిల్లీ: విద్యుత్ వినియోగం దేశంలో గరిష్ఠస్థాయికి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వినియోగించారు. బుధవారం నమోదైన 265.44 GW అనే మునుపటి రికార్డును ఇది అధిగమించింది. ఈ వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 270 GWకి చేరుకుంటుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇంతకుముందే అంచనా వేసింది. గత నాలుగు రోజులుగా విద్యుత్ వినియోగం అత్యధిక స్థాయికి చేరింది. వేసవి తీవ్రతతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. 

ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన వడగాలుల కారణంగా ప్రజలు ఏసీలు, డెజర్ట్ కూలర్ల ఎక్కవగా వాడటంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. గత వేసవిలో జూన్ 2025లో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 242.77 GWగా ఉంది. అయితే, ఇది ప్రభుత్వం అంచనా వేసిన 277 GW స్థాయి కంటే తక్కువగానే ఉంది. మే 2024లో, గరిష్ట విద్యుత్ డిమాండ్ 250 GWకు చేరుకుంది.

ఇది ఆ సమయానికి ఒక రికార్డుగా నిలిచింది. సెప్టెంబర్ 2023లో నెలకొల్పిన గత అత్యధిక రికార్డు అయిన 243.27 GWను అధిగమించింది. ''దేశంలో నెలకొన్న తీవ్రమైన వడగాలుల కారణంగా, విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. అవసరమైన మేర విద్యుత్‌ను సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే, ఈ తీవ్రమైన వేసవి దృష్ట్యా, మనమందరం విద్యుత్‌ను తెలివిగా, పొదుపుగా వినియోగించుకోవడానికి ప్రయత్నిద్దాం'' అని విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.