16 April, 2026 | 6:39 AM

కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

23-11-2025 12:38 AM
  1. బాయిలర్ ట్యూబ్‌లో సాంకేతిక లోపం
  2. రూ.కోట్లలో నష్టం.. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం 

జయశంకర్ భూపాలపల్లి(మహబూబాబాద్), నవంబర్ 22 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లోని మొదటి, రెండవ దశలలో బాయిలర్ ట్యూబ్‌ల్లో సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు విద్యుత్ ప్లాంట్లలో కలిపి 1,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.కోట్లలో నష్టంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే పరిస్థితి నెలకొంది. కేటీపీపీలో 1, 2 యూనిట్లలో శనివారం బాయిలర్ ట్యూబ్‌ల్లో లీకేజీ కావడంతో కావడంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.

కేటీపీపీ ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమత్తు పనులను నిర్వహిస్తున్నారు. తొలుత 1వ యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, 1వ యూనిట్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి 2వ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్లు చెపుతున్నారు. శనివారం సాయంత్రం వరకు మరమ్మతులు పూర్తి కాకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కొనసాగుతున్నట్లు చెపుతున్నారు.

2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల కోట్ల రూపాయల ఆదాయం కేటీపీపీ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తున్నది. మొదటి దశలో బాయిలర్ ట్యూబ్‌లో తలెత్తిన సాం కేతిక లోపాన్ని శనివారం రాత్రి వరకు పూర్తి చేసి సింక్రనైజేషన్ ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి వరకు రెండు విద్యుత్తు ప్లాంట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రెండు ప్లాంట్లలో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే మొదటిసారిగా జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.