calender_icon.png 23 November, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరిలో పీఆర్సీ నివేదిక!

23-11-2025 12:45:12 AM

కొత్త ఏడాదిలో ఉద్యోగులకు సర్కారు శుభవార్త

20-30 శాతం ఫిట్‌మెంట్‌కు సుముఖత

ప్రభుత్వంపై భారం పడకుండా అమలుకు యోచన

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): పీఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త ఏడాదిలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. పీఆర్సీ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కొత్త ఏడాది వరకు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది. జనవరిలోనే ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది.

అయితే ఉద్యోగ, ఉపాధ్యాయులు అడుగుతున్నంత కాకపోయినా, ఉద్యోగుల మనసు నొచ్చకుండా ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఆర్సీ ప్రకటించే ముందు ఒకసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయి ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా వారిని ఒప్పించి పీఆర్సీ ప్రకటించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

30 శాతంలోపు ఇచ్చే ఛాన్స్..

సమయానుగుణంగా పీఆర్సీ అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. పీఆర్సీ, డీఏ, ఏది ఇవ్వాలన్నా నిధులు కావాల్సిందే. రాష్ట్ర ఆదాయ, వ్యయాలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నిర్ణయాలు తీసుకుంటోంది. పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధమై కూడా మూడునాలుగు నెలలు అవుతోంది. కానీ దీన్ని కావాలనే అమలు చేయడం లేదు. పీఆర్సీ కమిటీ నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు. దీంతో దాన్ని అమలు చేయకుండా తప్పించుకునే పరిస్థితి ఉండదు. పీఆర్సీ నివేదికను రూపొందించే క్రమంలో పదుల సంఖ్యల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుంది. కొన్ని సంఘాలు 50 ఫిట్‌మెంట్ ఇవ్వాలని, మరికొన్ని సంఘాలు 51 ఫిట్‌మెంట్ అని, ఇంకొన్ని కనీసం 30 కంటే పైనే ఫిట్‌మెంట్ అమలు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాయి.

ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ మేరకు 51 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలంటే రూ.12,750 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇది సర్కారుకు ప్రస్తుతం మోయలేని భారమనే చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా 20 నుంచి 30 శాతం లోపు ఫిట్‌మెంట్ ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు.

వీరందరికీ కనీసం 1 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు రూ.250 నుంచి రూ.300 కోట్లు కావాల్సి ఉంటుంది. ఒక వేళ 20 (250 చొప్పున) శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తే రూ.5 వేల కోట్లు, 30 శాతం ఇస్తే రూ.7,500 కోట్లు మాత్రమే భారం పడుతోంది. ఇలా అమలు చేస్తే ప్రభుత్వానికి కొంత ఊరట కల్గించే అంశం. రెండున్నరేండ్లు కావొస్తున్నా..పీఆర్సీ అమలు చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అడగని ప్రభుత్వం.. ఇవ్వని కమిటీ.. 

పీఆర్సీ అమలుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఆ నివేదికను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం తీసుకునేందుకు ముందూవెనుకా అవుతోంది. కమిటీకి ప్రభుత్వం సమయం ఇవ్వడంలేదు. దీంతో ప్రభుత్వం పిలిచినప్పుడే నివేదిక ఇస్తానమి పీఆర్సీ కమిటీ వేచిచూస్తోంది. వాస్తవంగా 2023 జూలై 1 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పీఆర్సీ అమలు కావాల్సి ఉంది.

ఐఏఎస్  రిటైర్డ్ అధికారి ఎన్.శివశంకర్ చైర్మన్‌గా పీఆర్సీ కమిటీని కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. 2024 ఏప్రిల్ 2వ తేదీతో ఆ కమిటీ గడువు కూడా ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ కమిటీ గడువును ఆరునెలలు పొడిగించారు.

ఈ  ఏడాది అక్టోబర్ 2వ తేదీకే పీఆర్సీ కమిటీని నియమించి రెండేండ్లు కూడా పూర్తయ్యింది. కానీ ఇంత వరకు ప్రభుత్వం నివేదిక తీసుకునేందుకు కమిటీని ఆహ్వానించలేదు. డిసెంబర్‌లో లోకల్ బాడీ ఎన్నికలు రానున్న క్రమంలో ఇప్పట్లో పీఆర్సీని అమలు చేసే అవకాశం లేదు. ఒకవేళ అమలు చేయాలంటే ఎన్నికల షెడ్యూల్ రాకముందే చేయాలి లేదంటే వచ్చే ఏడాదిలోనే ప్రకటించాల్సి ఉంటుంది.

రెడీగా నివేదిక..

ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేయాలి. పీఆర్సీ కమిటీ నివేదికను సిద్ధం చేసి రెడీగా ఉంచింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబె ట్టుకోవాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌ను కూడా ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. ఈహెచ్‌ఎస్ పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వం కాలయాపన చేయకుం డా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.

 మారం జగదీశ్వర్,

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్