దినసరి కార్మికుడిపై కూలిన ప్రహరీ
9 గంటల పాటు శ్రమించి బయటకు తీసిన అధికారులు
మేడ్చల్, జూన్ 3 (విజయక్రాంతి) : మరమ్మతులు చేస్తుండగా ప్రహరీ గోడ కూలడంతో ఓ దినసరి కార్మికుడు గాయపడిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర వెన్నెలగడ్డ శ్రీనిలయ ఎన్‌క్లేవ్‌లోని బృందావన్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పాత ప్రహరీ శిథిలావస్థకు చేరడంతో మరో గోడను నిర్మించేందుకు పనులు ప్రారంభించారు.
ఐదుగురు దినసరి కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఉదయం 11:45 నిమిషాలకు ప్రహరీ ఒక్కసారిగా కూలి పోయింది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా పూర్వి మండలం, నేరేడు గ్రామం కాకుల బోడ్ తండాకు చెందిన బానోత్‌రెడ్డి (35)పై గోడ పడి అందులో చిక్కుకున్నాడు. పక్కనే ఉన్న కార్మికులు బానోత్ రెడ్డిని బయటికి లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక అధికారులు రాత్రి 9 గంటల వరకు తీవ్రంగా శ్రమించి బనోత్ రెడ్డిని బయటకు తీసి వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






