3 April, 2026 | 3:15 AM

ప్రజాపాలన- ప్రణాళిక గ్రామసభలు విజయవంతం

03-04-2026 12:39 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభలు మండలంలోని బొల్లారం, ఆత్మకూర్, మాసన్పల్లి, జలాల్పూర్, తాండూర్, గోపాల్పేట్, నాగిరెడ్డిపేట వివిధ గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించబడింది.99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జరిగిన ఈసభలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న రకం వడ్ల కొనుగోలు, పెన్షన్లు, గృహజ్యోతి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కొత్త రేషన్ కార్డులు తదితర పథకాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో నాగిరెడ్డిపేట్ మండలం అభివృద్ధి దిశగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రశంసించారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించగా, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పలు గ్రామాల్లో చేపట్టవలసిన ముందస్తు చర్యలపై ప్రజలతో చర్చించారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ... ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడికి పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య, ఉపాధి, క్రీడలు, మహిళా శిశు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో ప్రజాపాలన ప్రభుత్వం..

తాడ్వాయి, ఏప్రిల్ 2(విజయ క్రాంతి): అభివృద్ధి పథంలో ప్రజా పాలన ప్రభుత్వం కొనసాగుతుందని అధికారులు వివరించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని గ్రామాలలో గురువారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక పేరుతో ఈ గ్రామసభలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. 99 యాక్షన్ ప్రణాళికలు నిర్వహించి ప్రత్యేక అభివృద్ధికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గ్రామసభల్లో అధికారులు పాల్గొని ప్రజాపాలన ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గతంలో లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపారు.

అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డుల పంపిణీ,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం, గ్రామాల్లో ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు సన్నరకం వడ్లకు రూ.500 బోనస్, ఉచిత కరెంటు సౌకర్యము తదితర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వం అభివృద్ధి పతంలో ముందుకు సాగుతుందని తెలిపారు.తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్, నందివాడ, ఏండ్రి యాల, దేమి కళాన్, కన్ కల్,కరడ్పల్లి,కృష్ణాజివాడి, తాడ్వాయి, చిట్యాల, బ్రాహ్మణపల్లి, సంగోజీవాడి, చందాపూర్, సోమారం, బ్రహ్మాజీ వాడి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.  ఇన్చార్జి ఎంపీడీవో సవితా రెడ్డి, గ్రామాల సర్పంచులు విజయ రాములు, సంకు పోచయ్య, నర్సింలు, మంగారెడ్డి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ప్రజాపాలన గ్రామసభలు..

నిజాంసాగర్, ఏప్రిల్ 2( విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ ఫలాలపై చర్చావేదిక ఏర్పాటు చేసి, గ్రామంలోని మౌలిక సదుపాయాలు కల్పనకు గ్రామసభ ద్వారా తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు నాయకులు అధికారులు పాల్గొన్నారు.