17 April, 2026 | 3:33 AM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సభ

17-04-2026 01:37 AM

మంగపేట, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమని, గ్రామాభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని ములుగు జిల్లా పంచాయతీ అధికారి ( మంగపేట మండల ప్రత్యెక అధికారి ) కొండ వెంకయ్య అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని గంపోనిగూడెం రైతు వేదిక వద్ద మంగపేట ఎంపీడీఓ బద్రు నాయక్ అధ్యక్షతన మండల స్థాయి ప్రత్యేక సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు మండలంలో వారి పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు,  సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, తదితర పథకాలకు సంబంధించి  వివరాలను ప్రజలకు తెలియజేశారు.

అదే విధంగా నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ భీమా, మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ కు విస్తరణ, విభిన్న ప్రతిభావంత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రీయ వ్యవసాయం పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి ( మంగపేట మండల ప్రత్యెక అధికారి ) కొండ వెంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడం, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తోట రవీందర్, యస్త్స్రలు టి.వి.ఆర్.సూరి, శ్రీకాంత్, ఏఓ నేదునూరి చేరాలు, ఎంఈఓ పొదెం మేనక, పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, డీహెచ్‌ఈడబ్ల్యూ డిఎంసి పీ.రమాదేవి, ట్రాన్స్ కో ఎఈ కృష్ణారావు , ఆర్‌ఐ శ్రీనివాస్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపిఒ అంకుష్, ఐకేపి ఏపిఎం సత్యనారాయణ రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ అశోక్, డాక్టర్ అఖిల, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ యాకయ్య, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.