17 April, 2026 | 3:29 AM

‘మల్లన్న’ నిర్వాసితులకు తిప్పలు?

17-04-2026 01:36 AM
  1. అనుమతి లేనిదే నిర్మాణాలు చేదంటూ ఆపేసిన మున్సిపల్ సిబ్బంది 

మరి కొన్ని రోజుల వరకు  మినహాయింపు ఇవ్వాలంటున్న పునరావాసులు 

గజ్వేల్, ఏప్రిల్ 16: గ్రామాలను కోల్పోయి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉన్న మల్లన్న సాగర్ పునరావాసులకు ఇండ్లు నిర్మించుకోవడానికి పర్మిషన్ పోటు తగిలింది. ప్రభుత్వం గతంలో మల్లన్న సాగర్ లో తమ గ్రామాలను ఖాళీ చేసి వచ్చినందుకు పునరావాసంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రెవెన్యూ పరిధిలో  ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు.

ఇండ్లను ఇండ్ల స్థలాలను లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ చేయగా, ఖాళీ ప్లాట్ లలో ఇప్పుడిప్పుడే ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇల్లు భూములు కోల్పోయి ప్రభుత్వం ఇచ్చిన కొద్ది డబ్బులతో ఇండ్లు నిర్మిస్తుండగా, ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది ఇంటి పర్మిషన్ తీసుకుంటే గాని నిర్మాణాలు కొనసాగించేది లేదని ఖరాకండిగా చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో వేల సంఖ్యలో ప్లాట్లు రావాల్సి ఉండగా, అందులో ప్లాట్లు వచ్చినవారు దీనిలో నిర్మించుకుంటున్న సంతోషం అప్పుడే ఆవిరైపోయింది. అనుమతులకు వేలు, లక్షల రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వాలు మాకు న్యాయం చేసినట్లు ఎట్లా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు కొనసాగించడానికి మరి కొన్ని సంవత్సరాలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

అన్ని ప్రభుత్వానికే ఇచ్చాం.. ఇప్పుడు అనుమతులు అంటే ఎట్లా : 

 మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కష్టపడి కట్టుకున్న ఇళ్లను, భూములను, ఉన్న ఊరును విడిచిపెట్టి వచ్చేసాం. ఇప్పుడు ప్రభుత్వం ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన ప్లాటులో  వేలకు వేలు పెట్టి పర్మిషన్ తీసుకోని ఇల్లు కట్టుకోవాలా. ఊరు విడిచి పెట్టేటప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా.  ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించాలి. మరి కొన్ని సంవత్సరాలు ఆర్ అండ్ ఆర్ కాలనీలో  ఎలాంటి అనుమతులు లేకుండానే ఇండ్లు నిర్మించుకునేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు పునరావాసులకు అండగా నిలవాలి.

- గూడూరి రాములు, తొగుట మాజీ జడ్పిటిసి, పల్లెపహాడ్ నివాసి