మీ ముసుగు తొలిగింది
బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా?
ప్రశాంత్ కిషోర్‌పై దేశవ్యాప్తంగా ట్రోలింగ్
కరణ్ థాపర్ షోలో నీళ్లు తాగటంపై సెటైర్లు
ట్రోల్స్‌పై మండిపడిన ఎన్నికల వ్యూహకర్త
జూన్ 4న మీరూ నీళ్లు తాగుతారని ఆగ్రహం
న్యూఢిల్లీ, మే 23: లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఉన్నట్టుండి ప్రత్యక్షమై బీజేపీ గెలుస్తుందని జోస్యాలు చెప్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై దేశవ్యాప్తంగా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తున్నది. ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ముసుగు తొలగిందని, ఆయన బీజేపీ అధికార ప్రతినిధి అన్న విషయం బయటపడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు తాగటంపై విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. ఈ ట్రోలింగ్‌పై కిషోర్ కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు.
మీరూ నీళ్లు తాగుతారు
కరణ్ థాపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్‌కిషోర్.. పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300లకు పైగా సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పారు. ఆ సమయంలో థాపర్ సంధించిన పలు ప్రశ్నలకు ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. బీజేపీ 300 సీట్లకు పైగా గెలుస్తుందని ప్రశాంత్‌కిషోర్ చెప్పగా.. ‘మీ అంచనాలు నిజమవుతాయని ఎందుకు అనుకోవాలి? గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో, తెలంగాణలో, బెంగాల్‌లో కూడా మీ అంచనాలు తప్పాయి కదా? తెలంగాణ, హిమాచల్‌లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా?’ కరణ్ థాపర్ ప్రశ్నలు సంధించారు. దాంతో ప్రశాంత్ కిషోర్ కొద్దిసేపాగి.. నీళ్లు తాగి.. గతంలో తన అంచనాలు నిజమైన సందర్భాలను ఏకరువు పెట్టారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కిషోర్‌ను ట్రోల్ చేశారు. దీనిపై ఆయన స్పందించారు. ‘నీళ్లు తాగటం మంచి దే. నీళ్లు శరీరాన్ని, మస్తిష్కాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. ఈ ఎన్నికలపై నా అంచనాలను గేలిచేస్తున్న వారు.. జూన్ 4న నీళ్లు భారీ మొత్తంలో దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రశాంత్‌కిషోర్‌ను బీజేపీ అధికార ప్రతినిధిగా పెట్టుకొన్నదంటూ ఓ పత్రం వైరల్ కాగా.. దానిని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా షేర్‌చేశారు. దీనిపై పీకే పార్టీ జన్‌సురాజ్ ఎక్స్‌లో స్పందించింది. ‘కాంగ్రెస్, రాహుల్.. మీరేమో ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతారు.. నకిలీ వార్తలకు బాధితులమని చెప్పుకొంటారు. ఇప్పుడు మీ పరిస్థితి చూసుకోండి. మీ పార్టీ సమాచార విభాగం అధిపతి జైరాంరమేశ్ స్వయంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించింది.
ఉన్నట్టుండి తెరపైకి
ప్రశాంత్ కిషోర్ ఓటర్లను తాను అనుకున్న పార్టీవైపు మళ్లించేందుకు సోషల్‌మీడి యాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయిస్తారన్న ఆరోపణలున్నాయి. వివాదాలతో పాటు కొన్నిసార్లు అంచనాలు తప్పటంతో రెండేండ్ల క్రితమే తాను ఏ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉండనని ప్రకటించారు. అన్నట్టుగానే ఎన్నికల సర్వేల్లోకి దిగకుండా అప్పుడప్పుడూ అభిప్రాయాలు వెల్లడిస్తూ వస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ఆయన ఎక్కడా కనిపించలేదు. ఉన్నట్టుండి తెరపైకి వచ్చి పెద్దపెద్ద మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నా రు. గతానికి భిన్నంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రచార తీరు మారుతూ వస్తున్నది. ఎన్నికల ప్రారంభంలో పదేండ్లలో చేపట్టిన అభివృద్ధి గురించి మాట్లాడిన మోదీ.. మూడో ఫేజ్ పోలింగ్ ముగిసే సమయానికి తనలోని ముస్లిం వ్యతిరేకతను బహిరంగంగా బయటపెట్టుకొని.. ఎన్నికల ప్రచారాన్ని మత ప్రచారం వైపు మళ్లించారు. మొదట ౪౦౦ సీట్లు గెలుస్తామని చెప్పిన మోదీ, బీజేపీ నేతలు.. ఐదో ఫేజ్ ముగిసేనాటికి ‘మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని మాత్రమే చెప్తున్నారు. మోదీ ప్రచార తీరుపై మేధావుల తోపాటు సామాన్యుల్లోనూ వ్యతిరేకత పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో పీకే తెరపైకి రావటంపై రాజకీయ విశ్లేషకులు అనుమానా లు వ్యక్తంచేస్తున్నారు. గెలుపు అంచనా వేయదలుచుకొంటే ఎన్నికలు ప్రారంభం అయినప్పుడే చెప్పాలి.. లేదా పూర్తిగా ముగిసిన తర్వాత చెప్పొచ్చు.. కానీ మధ్యలో వచ్చి చెప్పటమేమిటని ఎద్దేవా చేస్తున్నా రు.






