18 April, 2026 | 1:33 AM

పీఆర్సీ, పెండింగ్ బిల్లులు.. ఇంకెప్పుడిస్తారు?

18-04-2026 12:00 AM
  1. ఆరు నెలలన్నారు..మూడేళ్లు కాబోతుంది
  2. ఉద్యోగుల నిరసనలతో దద్దరిల్లిన కార్యాలయాలు
  3. మే 5న రాష్ట్రవ్యాప్తంగా నిరహార దీక్షలు: జేఏసీ

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఇచ్చి న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తమ గళాన్ని విప్పారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లంతా ఏకమై నిరసనలు చేపట్టారు. సచివాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లోని అన్ని హెచ్‌వోడీ కార్యాలయాల్లో మధ్యాహ్న భోజన విరామ సయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పీఆర్సీ, డీఏలను వెంటనే ఇవ్వాలని, హెల్త్ కార్డులను జారీచేయాలని, ఓపీఎస్ అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర సచివాలయం ఆవరణలో వందలాది మంది ఉద్యోగులు చేపట్టిన నిరసన హోరెత్తింది. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుతోపాటు జేఏసీ నాయకులు చావా రవి, బీ శ్యామ్, ఎస్‌ఎం హుస్సేని ముజీబ్, వంగా రవీందర్‌రెడ్డి, జీ సదానందంగౌడ్, స్థితప్రజ్ఞ, జీ శ్రీనివాస్‌రెడ్డి, రమాదేవి, సురేష్‌కుమార్, రేండ్ల రాజేష్, కే లక్ష్మయ్య, జీ సురేష్, మోహన్‌రావు, కే వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, దీపారెడ్డి, ఎంబీ కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉద్యో గుల జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. .ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో భాగంగా పలు ప్రధాన డి మాండ్లతో నిరసన కార్యక్రమాన్ని పిలుపిచ్చినట్లుగా తెలిపారు.

 కొత్త ప్రభుత్వం ఏర్పాటై కూడా రెండున్నరేళ్లు అవుతోందని, పీఆర్సీ కమిటీ వేసి మూడేళ్లవుతోందని, వెంటనే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశా రు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. హెల్త్ కార్డుల విషయంలో ఇదిగో అదిగో అనడమే తప్ప ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంత వరకూ హెల్త్ కార్డులను ఇవ్వలేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.

పెండింగ్ బిల్లులు, డీఏలతో కలిపి పీఆర్సీని ప్రకటించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొ త్తం ఉద్యోగులందరూ పెద్దఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ వేలాది మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో నినదించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి గతంలో తమ సమస్యలు తీసుకెళ్లినప్పుడు తమది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమని, కొంత సమయమివ్వాలని కోరారని, అయితే ఇప్పటికే మూడే ళ్లుకావొస్తుందని, మరో ఏడాదైతే ఎన్నికల హడావిడి ఉంటుందన్నారు. 

పీఆర్సీ, పెండిం గ్ బిల్లులు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానాలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని, అది ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రెండేసి పెన్షన్లని, తమకు మాత్రం ఒక్కటేనని, తమ బిల్లులు తమకివ్వాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.13 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. నెలవారీగా ఇచ్చే అరకొర నిధులు ఉద్యోగుకలు, పెన్షనర్ల అవసరాలకు సరిపోవడం లేదని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రతినెలా ఉద్యోగులు రిటైర వుతున్నారని, ప్రతినెలా ఇచ్చే రూ.700 కోట్లు సరిపోవడంలేదని, ఆ నిధులను పెంచాలన్నారు.

ముఖ్యమైన డిమాండ్లు ఇవి

* 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలి.

* ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలు చేయాలి.

* రూ.13వేల కోట్ల ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు ఏకమొత్తంలో విడుదల చేయాలి.

* ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలి.

* సెక్రటేరియేట్‌లో 12.5 శాతం కోటా అమలు చేయాలి

* ప్రభుత్వం ముందు ఉంచిన మిగిలిన డిమాండ్లను  కూడా పరిష్కరించాలి

పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు ఇవ్వడంలేదు: బీ శ్యామ్, టీజీవో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి

పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇళ్లు కట్టుకోవడానికంటూ దాచుకున్న డబ్బును కూడా ఇవ్వడంలేదు. మా అవసరానికి మా జీతాల నుంచి దాచుకున్న జీపీఎఫ్, పీఎల్‌ఐ బిల్లులు మూడేళ్లు, నాలుగేళ్లవుతున్నా ఇవ్వడంలేదు. పెండింగ్ బిల్లులతో కలపకుండా వీటిని వెంటనే విడుదల చేయాలి. డిఏ అంటే డిలే అలవెన్సుగా, పీఆర్‌సీ అంటే పెండింగ్ రివిజన్ కమిషన్‌గా ప్రభుత్వం అర్థాలను మార్చేసింది. తమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో మూడు డీఏలు విడుదల చేసి, పీఆర్సీని ప్రకటిస్తా అన్నారు. మమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా చూడాలి...వేరుగా చేసి చూడొద్దు. మే 5న రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు నిరహార దీక్ష కార్యక్రమాన్ని చేపడుతాం.

ఓపీఎస్‌తో ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి: స్థితప్రజ్ఞ, సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఇప్పటి వరకు 2,316 మంది సీపీఎస్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. వీరికి కనీసం పెన్షన్ సౌకర్యం లేకపోవడం అన్యాయం. ఉద్యోగ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగులకు వారి కుటుంబాలకు నగదు రహిత హెల్త్ స్కీం అమలు చేయాలి. వృద్ధాప్యంలో ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

మాకిచ్చేందుకే డబ్బుల్లేవా?: ఎస్‌ఎం హుస్సేని ముజీబ్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధానకార్యదర్శి 

మా మంచితనాన్ని చేతగాని తనంగా భావిస్తున్నారు. ఓపికతో వ్యవహరిస్తున్నాం. రాష్ట్ర ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. మేము ఎంత కొట్లాడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. మాకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇవ్వడంలేదు. క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు ఇవ్వడంలేదు.

ఉద్యోగులంతా అమరవీరులను తలచుకుని మళ్లీ పోరాడాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. పైసల్వేవు అంటూనే కొత్త పథకాలు పెడుతున్నారు. మాకిచ్చేందుకే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా? ఇక ఉద్యమాలే శరణ్యం. 2వ పీఆర్సీ కమిటీ వేసి 30 నెలలు గడుస్తున్నాయి. వెంటనే నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో జూన్ 2వ తేదీలోపు పీఆర్సీని అమలు చేయాలి.