6 May, 2026 | 7:00 PM

రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి

06-05-2026 06:30 PM

- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి వాటిని ప్రభుత్వము సహించదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించిందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రైతు రుణమాఫీ వంటి కీలక నిర్ణయాలను అమలు చేశామని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేక పోయిందన్నారు.

ఇప్పుడు రెండేళ్లలోనే అమలు చేస్తున్నా, ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు అన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనీ,అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవసరమైతే ప్రజల ముందు ఓపెన్ చర్చకు సిద్ధమని, రైతులకు ఎవరు ఏమి చేశారో చర్చిద్దామని సవాల్ విసిరారు.రైతు రుణమాఫీ 80 శాతం పైగా పూర్తి చేశాం.

ధాన్యం కొనుగోలు వ్యవస్థను మెరుగుపరచి రైతులకు న్యాయం చేస్తున్నాం అని అన్నారు.గతంలో రైతులకు నకిలీ విత్తనాల సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వాగతిస్తాం, కానీ అసత్య ప్రచారం, అవమానకర వ్యాఖ్యలు చేస్తే కఠినంగా ఎదుర్కొంటాం అని హెచ్చరించారు.