ఉత్తమ సేవలకు ప్రతిష్టాత్మక అవార్డు
అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్‌కు ‘ఎన్‌టీఆర్ సేవా నంది’ పురస్కారం
ఎల్బీనగర్, మే 28: ఎల్బీనగర్‌లోని అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ’ఎన్టీఆర్ సేవా నంది’ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ కు చెందిన యువ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో గురువారం చిక్కడిపల్లిలోని త్యాగరాజ గాన సభలో నటరత్న ఎన్టీఆర్ 103వ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీ డాక్టర్ ఎస్.మధు సూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై మార్గం రాజేశ్ కు ‘ఎన్టీఆర్ సేవా నంది‘ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా యువ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ వెంకటరమణ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహాన్ని వ్యక్తిగతంగా చూశానన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ పిల్లలకు మార్గం రాజేశ్ అందిస్తున్న సేవలు అమోఘమని, తండ్రిగా, అన్నగా అన్ని భాద్యతలను భుజాన వేసుకుని నిస్వార్ధంగా సేవ చేస్తున్న రాజేష్ సేవలను గుర్తించి ’ఎన్టీఆర్ సేవా నంది’ పురస్కారానికి ఎంపిక చేశామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గాంధీనగర్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ వరప్రసాద్, సోనస్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సీఈవో జేమ్స్ వాట్ తదితరులు పాల్గొన్నారు.






