1 September, 2026 | 6:43 AM

పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు

14-07-2026 04:21 PM

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం: అనంతుల మధు

చివ్వెంల,(విజయక్రాంతి): పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన "చలో సచివాలయం ముట్టడి" కార్యక్రమం నేపథ్యంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, డీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్‌ను చివ్వెంల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా అనంతుల మధు మాట్లాడుతూ, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తిచేసినా తమ సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్యార్థులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, ఎన్నికల హామీలను అమలు చేయకుండా సమస్యలపై ప్రశ్నించే వారిపై ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.