22 April, 2026 | 6:51 PM

ప్రధాని క్షమాపణ చెప్పాలి

27-06-2024 05:01 AM
  • విద్యార్థి, యువజన సంఘాల నాయకులు

నారాయణగూడలో మోదీ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపాయి. బుధవారం నగరంలోని నారాయణగూడ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను ఆయా సంఘాల నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, మహేశ్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ పేపర్‌ను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ స్పందించకపోతే భారత్ బంద్ నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు జావేద్, లెనిన్, స్టాలిన్, శ్రీమాన్, శ్రీను, అనిల్, హష్మి తదితరులు పాల్గొన్నారు.