22 April, 2026 | 8:13 PM

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

27-06-2024 04:58 AM
  • రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

యువత డ్రగ్స్ వాడి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు: మంత్రి సీతక్క

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): డ్రగ్స్ రవాణా చేసినా.. వాడినా కఠిన శిక్షలు అమలు చేస్తామని ఎక్సైజ్, ప్రొహిబిషన్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దురలవాటు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర యాంటీ  నార్కొటిక్స్ బ్యూరో, డీఈపీడబ్ల్యూడీ ఆధ్వర్యంలో  బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. మంత్రి సీతక్కతో కలిసి తొలుత డ్రగ్స్ నిర్మూలనపై సినీ స్టార్ చిరంజీవి వీడియో సందేశంతో పాటు థియేట్రికల్ ఏవీని, డ్రగ్స్ నివారణ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

టీజీ న్యాబ్ ఎస్పీ భాస్కర్ రచించి, రామ్ మిర్యాల పాడిన, సుమన్ నటించిన ‘తెలంగాణ పౌరులారా రండి’ అనే పాటల సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ వినియోగిస్తే జీవితం చిత్తు అవుతుందన్నారు. ఎంతో మంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారన్నారు.  డ్రగ్స్ రవాణా చేస్తున్న, లేదా తయా రు చేస్తున్న వారిపై కఠిన శిక్షలు ఉంటాయన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. డ్రగ్స్ మత్తులో ఓ వ్యక్తి పెద్దపల్లి సింగరేణి కాలనీ చిన్నారిపై లైంగిక దాడి చేయడం తనను కలచివేసిందన్నారు. గంజాయి మత్తు గ్రామాల కూ చేరడం విచారకరమన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకుని యువత క్షణికావేశంలో తప్పులు చేస్తున్నారు. దీంతో వారి భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.

అలాంటి వారి ని సమాజం చీడపురుగులా చూస్తుందన్నా రు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సినీ నటుడు సుమన్,   మహిళా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, యువహీరో శ్రీతేజ సజ్జ, డీజీపీ రవి గుప్తా, డీజీపీ రవిగుప్తా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, డీసీఏ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, డీఈపీడబ్ల్యూడీ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.