మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం
- బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు
- వివిధ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి పనులపై సమీక్ష
- పాల్గొన్న మంత్రి అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించామని వెల్లడించారు. గురువారం సచివాల యంలో మైనార్టీల సంక్షేమం, వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవాల) సందర్భంగా హైదరాబాద్‌లో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ’ముషాయిరా’ (కవి సమ్మేళనాలు) నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఆధునిక హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మైనార్టీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. మైనార్టీ సంస్థల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో శ్మశానవాటికల ఏర్పాటుకు స్థలాలను సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో జరగబోయే మొహర్రం వేడుకలకు హాజరుకావాల్సిందిగా మంత్రి అజారుద్దీన్ కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ సిక్తా పట్నాయక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ మరియు ప్రెసిడెంట్ ఫహీమ్ ఖురేషీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాను, మైనార్టీ వెల్ఫేర్ సెక్రెటరీ షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.






