calender_icon.png 2 February, 2026 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు, చిన్నపిల్లల రక్షణకు ప్రాధాన్యత

02-02-2026 04:16:38 PM

జిల్లా ఎస్పీ నితిక పంత్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో మహిళలు, యువతులు, బాలికలు ఎవరైనా హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా కేంద్రాలు జిల్లాలో సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కళాశాలలు, పాఠశాలల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ అంశాలపై షీ టీం, భరోసా టీం, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఏదైనా హింసకు గురైతే వెంటనే షీ టీంను సంప్రదించాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా జనవరి నెలలో షీ టీం ద్వారా 83 హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించగా, 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. మొత్తం 11 ఫిర్యాదులు అందగా, వాటిలో 3 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, 7 ఫిర్యాదులను అప్పటికప్పుడే పరిష్కరించామని, మరో ఫిర్యాదులో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.చిన్నపిల్లలు, మహిళల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని  తెలిపారు.

మహిళలు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా మహిళలు లేదా పిల్లలు వేధింపులకు గురవుతున్నట్లు గమనిస్తే నేరుగా పోలీసులను సంప్రదించలేని వారు షీ టీంను సంప్రదించాలని తెలిపారు. ఆసిఫాబాద్ డివిజన్ షీ టీం నంబర్: 8712670564, కాగజనగర్ డివిజన్ షీ టీం నంబర్: 8712670565 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ హామీ ఇచ్చారు.