2 September, 2026 | 5:22 AM

వెయ్యి రోజుల పాలనలో సెటిల్మెంట్లకే ప్రాధాన్యం

02-09-2026 | 12:00am

బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో భూవివాదాలు, సెటిల్మెంట్లకే ప్రాధాన్యం ఇచ్చారని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే కాలనీలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ఎమ్మెల్యే దానం నాగేందర్..

భూదందాలు, సెటిల్మెంట్ల వ్యవహారాల్లో తలమునకలవుతున్నారంటూ ఆరోపణల వర్షం కురిపించారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నిప్పులు చెరిగారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నియోజకవర్గంలో సెప్టెంబర్ 8 వరకు నిరసనలు చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు నరసింహ, అయూబ్, నవీన్, ముస్తాక్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.